బిజీ బిజీ చినబాబు ఎలక్షన్ టూర్స్..

21:35 - July 10, 2018

అమరావతి : ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. ప్రజాక్షేత్రంలోకి ద్విముఖ వ్యూహంతో వెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అన్ని జిల్లాల్లో ధర్మపోరాట దీక్షలు.. అన్ని నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటనలు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే 80 నియోజకవర్గాల్లో పర్యటించిన లోకేశ్‌ను.. మిగిలిన 90 నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఎన్నికల ముంగిట్లో టీడీపీ ద్విముఖ వ్యూహం
సాధారణ ఎన్నికలకు ఇక పది నెలల గడువే ఉంది. తరుణం తరుముకొస్తుండడంతో.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట ప్రజల మధ్య ఉన్నారు. జనసేనాని పవన్‌ కూడా ప్రజాక్షేత్రంలో గడుపుతున్నారు. పాలక టీడీపీ కూడా ప్రజలను పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు.. క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసే ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కీలక భూమిక పోషించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

నారా లోకేశ్‌కు నియోజకవర్గాల పర్యటనల బాధ్యత
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో పర్యటించారు. మిగిలిన 90 నియోజకవర్గాల్లోనూ.. వారానికి మూడు, నాలుగు నియోజకవర్గాలు పర్యటించేలా షెడ్యూల్‌ చేశారు. లోకేశ్‌, ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నారు.

లోకేశ్‌కు.. కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యత
పర్యటించిన ప్రతి చోటా.. విపక్షాలపై విసుర్లతో పాటు.. చంద్రబాబును మరోసారి ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రతిరోజూ పగలంతా సచివాలయంలో సమీక్షలు.. సాయంత్రానికి నివాసంలో పార్టీపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రతి రోజూ భేటీ అవుతూ.. చంద్రబాబు.... నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రజలతో మమేకమయ్యే బాధ్యతను లోకేశ్‌ తీసుకున్నారు. జగన్‌, పవన్‌లు ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచారానికి ప్రజాక్షేత్రంలోనే దీటుగా బదులివ్వాలని లోకేశ్‌ భావిస్తున్నారు.

ఇకపై నెలకు రెండు చొప్పున ధర్మపోరాట దీక్షలు
మరోవైపు.. ఎన్నికల వరకూ ధర్మపోరాట దీక్ష సభలు నిర్వహించాలని కూడా టీడీపీ భావిస్తోంది. ఇప్పటివరకూ తిరుపతి, విశాఖ, కాకినాడల్లోనే ధర్మపోరాట సభలు నిర్వహించారు. మిగిలిన పది జిల్లాల్లోనూ నెలకి రెండు చొప్పున సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ధర్మపోరాట దీక్షలు, నియోజకవర్గాల పర్యటనల ద్వారా క్యాడర్‌లో జోష్ నింపాలన్న ఆలోచనతో హైకమాండ్‌ కార్యక్రమాలు రూపొందిస్తోంది. మొత్తానికి పది నెలల ముందే.. రాష్ట్రంలో.. ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. 

Don't Miss