విశాఖలో మంత్రి వర్సెస్ కలెక్టర్

08:03 - July 17, 2017

విశాఖ : విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో మెడికల్‌ పరికరాల విడిభాగాల తయారీ కేంద్రం మెడ్‌టెక్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గతేడాదే శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మొత్తంగా 270.7 ఎకరాల భూమిని సేకరించింది. 196 ఎకరాల్లో 172 మంది రైతులు ఉన్నట్టు, వారు ఎన్నోఏళ్లుగా ఆ భూముల్లో తోటలు సాగు చేసుకుంటున్నట్టు రెవెన్యూ అధికారులు జాబితా రూపొందించారు. ఎకరానికి వీరికి 12 లక్షల చొప్పున.. మొత్తంగా 23.52 కోట్ల పరిహారం రైతులకు ప్రభుత్వం చెల్లించింది. అయితే 196 ఎకరాల్లో కేవలం ఇద్దరి పేరిట మాత్రమే డీ- పట్టాలు ఉన్నాయి. వాస్తవానికి వారికి మాత్రమే పరిహారం అందాలి. కానీ భూసేకరణ సమయంలో ఆ భూమిని గత కొంతకాలంగా ఆక్రమించుకొని సాగుచేసుకుంటున్న వారికీ పరిహారం అందించాలన్న నిబంధన కూడా ప్రభుత్వం చేర్చింది. దీన్నే అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పరిహారం విషయంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారని మంత్రి అయ్యన్న ఆరోపిస్తున్నారు. మొత్తం 170 మంది పేర్లతో అధికారులు జాబితా సిద్దంచేసినట్టు తెలిపారు. వీరంతా భూమిని సాగు చేస్తున్న దానికి నిదర్శనంగా లేని తోటలను సృష్టించారన్నారు. గ్రామంలో తమకు అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలను ఎంపిక చేశారని.. ఒక్కో కుటుంబం నుంచి ఆరుగురు మొదలు 43 మంది సభ్యుల పేర్లను జాబితాలో చేర్చినట్టు వివరించారు. ఈ జాబితాలో స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉన్నారు. 196 ఎకరాల్లో తోటలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 50 ఎకరాల్లో కూడా తోటలు కనిపించవు. మొత్తంగా 172 మంది లబ్దిదారుల్లో 44 మంది పేర్లు బినామీలవేనని మంత్రి అయ్యన్న ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మి అధికారులు సొమ్ము చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై 2015లోనే రెండుసార్లు లేఖ రాసినా స్పందించలేదని, చెల్లింపులు జరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు కోట్ల ప్రభుత్వ ధనాన్ని బినామీల పేరిట స్వాహా చేశారని.. దీనికి సిట్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు.

పరిహారం పంపిణీ
గ్రామ సభ నిర్వహించిన తర్వాతే అర్హులకు పరిహారం పంపిణీ చేశామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అనర్హులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదన్నారు. పరిహారం విషయంలో కొంతమంది కావాలనే వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. మెడ్‌టెక్‌ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు మంత్రికి వివరించామని... అయినా మరోసారి ఆయనను కలుస్తామన్నారు. పరిహారం చెల్లింపులో అధికారులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి మెడ్‌టెక్‌ భూముల పరిహారం వ్యవహారం మంత్రి, కలెక్టర్‌ మధ్య వివాదానికి తెరలేపింది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి

Don't Miss