పచ్చని గిరుల మధ్య 'పసిడి'చాను..

13:14 - April 7, 2018

ఈశాన్య రాష్ట్రాల నుంచి మెరిసిన మణిపూర్ మణిపూస ఎత్తిన బరువుల వెనుక ఎంతో కష్టం ఉంది. పుల్లలు ఏరుకునే స్థాయి నుండి భారతదేశపు ఉత్తమ పురస్కారమైన 'పద్మశ్రీ' స్థాయికి చేరుకుంది మణిపూర్ మణిపూస మీరాబాయి చాను..ఆరు నిమిషాలు... ఆరు లిఫ్ట్‌లు... ఆరు రికార్డులు... ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను తొలి బంగారు పతకాన్ని గెలుచుకుని దేశం యావత్తు గర్వపడేలా చేసింది ఈ పసిడి కొండ. 

పచ్చని కొండల మధ్య పుట్టిన పసిడి పతకం..

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మారుమూల గ్రామంలో ఈ బరువుల కొండ పుట్టింది. ఇంఫాల్‌ జిల్లాకు చెందిన నాంగ్‌పోక్‌ కక్చింగ్‌ పచ్చని కొండల మధ్య పుట్టింది చాను బంగారుకొండ. ఆ కొండ ప్రాంతాల్లో పెద్ద కుటుంబం..వ్యవసాయమే ఆధారం..వంట చేసుకోవాంటే చుట్టుపక్కల నుండి పుల్లలు ఏరుకుని తెచ్చుకోవాల్సిందే.. ఆరుగురు సంతానంలో చివరిగా పుట్టింది చాను. అన్నయ్య సాయిఖోమ్‌ సనటోంబా మీతీ కూడా చాను కూడా వంటచెరకు కోసం చెట్లమ్మట పుట్లమ్మటా తిరిగి పుల్లలను సేకరించేంది. అలా పుల్లలను ఏరుకుని నెత్తిన పెట్టుకుని వచ్చే చాను బరువులెత్తి బంగారు పతకాన్ని సాధించేస్థాయికి చేరుకుంది. బహుశా అప్పుడు ఆ అన్న తన చెల్లెలు పెద్దయ్యాక దేశం గర్వించే వెయిట్‌ లిఫ్టర్‌ అవుతుందని ఊహించలేదు. కానీ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది మీరాబాయి చాను.
వెయిట్‌లిఫ్టర్‌ కుంజరాణి దేవి స్ఫూర్తితో..
మీరాకు చిన్నప్పటి నుంచి వెయిట్‌లిఫ్టర్‌ కుంజరాణి దేవి అంటే ఎంతో అభిమానం, వల్లమాలిన ప్రేమ. వెయిట్‌లిఫ్టింగ్‌లో 50కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించి, 2006 కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించడంతో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంది. మీరాబాయి తండ్రి పీడబ్ల్యూడి డిపార్ట్‌మెంట్‌లో టెంపరరీ ఉద్యోగిగా విధులు నిర్వహించేవారు. పెద్ద కుటుంబ కావటంతో వ్యవసాయం కూడా చేయాల్సిన పరిస్థితి. తండ్రికి పొలం పనుల్లో తనకు సాయం చేస్తున్న కూతురు మీరాబాయిలో ఒక వెయిట్‌లిఫ్టర్‌ ఉందని గుర్తించింది ఆయనే. తమ ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీత అనితా చానును తన కూతురుకు శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరాడు ఆ తండ్రి.

పది సంవత్సరాలు కఠోర శిక్షణ..
ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకపోయినా మీరాబాయిని అనితా చాను ట్రైనింగ్‌ సెంటర్‌కు పంపారు. ఒకవైపు పొలంలో పనిచేస్తూనే 25 కిలోమీటర్లు వెళ్లి శిక్షణ పొందడం మొదలెట్టింది మీరాబాయి. కొన్ని రోజులకే మీరాలోని ప్రతిభను గుర్తించిన అనితా చాను ఆమెకు తన సెంటర్‌లోనే ఆశ్రయమిచ్చి, సుమారు పది సంవత్సరాలు కఠిన శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ మీరాను వరల్డ్‌క్లాస్‌ వెయిట్‌లిఫ్టర్‌గా తీర్చిదిద్దింది.

అభిమాన క్రీడాకారిణి రికార్డును దాటేసిన చాను ..
నాలుగేళ్ల క్రితం అంటే 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 48 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించి మీరాబాయి చాను తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పాటియాలాలో జరిగిన ‘రియో ఒలింపిక్స్‌ 2016’ ట్రయల్స్‌లో అప్పటిదాకా మహిళల జాతీయకోచ్‌ కుంజరాణి దేవి పేరిట ఉన్న రికార్డును తుడిపేసి సత్తాచాటింది.

అపజయం నుండి విజయం వైపు..
చానుపై పెరిగిన అంచనాలతో ఒలింపిక్స్‌లో ఒక పతకం గ్యారెంటీ అనుకున్నారంతా. అయితే రియో వేదికపై మీరాబాయి అడుగులు తడబడ్డాయి. ఒత్తిడికి గురైన చాను బరువులు ఎత్తడంలో విఫలమైంది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం నిరాశ, నిస్పృహలకు లోనయ్యాను. నాపై, నా కోచ్‌పై సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్స్‌ తీవ్రంగా వేధించటంతో ఒకస్థాయిలో ట్రైనింగ్ ఆపివేద్దామనే నిర్ణయానికి వచ్చేసింది. కానీ తనను తాను మానసకంగా బలపరుచుకుంది. ఆటలో గెలుపోటములు సహజమేనని ఇనుమడించిన ఉత్సాహంతో విపరీతంగా కష్టపడింది.

గోల్డ్‌కో్‌స్ట కామన్వెల్త్‌ లో తొలి గోల్డ్ మెడల్..
గత ఏడాది ‘వరల్డ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో బంగారు పతకాన్ని చేజిక్కించుకుని భవిష్యత్తుపై ఆశలు రేపిన మీరాబాయి చాను రాత్రింబవళ్లు కఠోర శ్రమతో గోల్డ్‌కో్‌స్టలో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో మన దేశానికి తొలి బంగారు పతకాన్ని సాధించింది. అంతేకాదు... వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది.

చాను గ్రామంలో పండుగవాతావరణం..
కామన్వెల్త్‌ గేమ్స్‌లో మీరాబాయి చాను బంగారుపతకం సాధించిందని తెలియగానే ఆమె గ్రామస్థులు పండగ చేసుకున్నారు. ‘థాబల్‌ ఛోంగ్బా’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య కొండ ప్రాంతాల నుంచి భవిష్యత్తులో చాలామంది క్రీడాకారులు మెరుస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో శుక్రవారం (6న) నదేశానికి మరో బంగారు పతకాన్ని అందించిన సంజితా చాను కూడా మీరాబాయి చానుకు స్నేహితురాలు కావడం మరో విశేషం. 

Don't Miss