టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి...

11:34 - August 11, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నా.... అక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించడం లేదు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ బంధం బలపడుతుందని అందరూ భావిస్తున్నా..... కేంద్రం మాత్రం ఏమీ తేల్చడం లేదు. చివరికి బైసన్‌పోలో గ్రౌండ్‌ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణే అవలంభిస్తోంది. 
రూటు మార్చిన టీఆర్‌ఎస్‌  
విభజన హామీల అమలుకు కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీఆర్‌ఎస్‌ రూటు మార్చింది. కేంద్ర ప్రభుత్వంతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయినా జాతీయ స్థాయి రాజకీయాలపై ఆసక్తితో సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నాలను కూడా చేశారు.  కానీ ఇటీవల కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలు మాత్రం బీజేపీకి సన్నిహితంగా టీఆర్‌ఎస్‌ ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో... ఏన్డీఏ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ కూడా సపోర్ట్‌ చేసింది.  దీంతో బీజేపీకి గులాబీ పార్టీ మరింత దగ్గరయ్యిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిది.
తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదనలకు నో గ్రీన్‌సిగ్నల్‌
టీఆర్‌ఎస్‌ కేద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గులాబీ పార్టీ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడాన్ని  గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి రక్షణశాఖ భూములను , రా ష్ట్రప్రభుత్వానికి కేటాయించాలని కోరుతోంది.  ఆ భూములలో సచివాలయంతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. నాలుగేళ్లుగా ఈ వ్యవహారాన్ని కేంద్రం తేల్చలేకపోతోంది. బెంగళూరులో రక్షణ శాఖ భూములను కర్నాటక ప్రభుత్వానికి కేటాయించడం, తెలంగాణలో కేటాయించకపోవడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు అధికారపార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో సయోధ్యగా వ్యవహరించినా... అనుకున్న స్థాయిలో సహకారం అందడంలేదన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా విభజన హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలుకాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్న వాదనను వారు తెరపైకి తీసుకొస్తున్నారు.

 

Don't Miss