ద్విపాత్రాభినయంలో మోహన్ బాబు

16:09 - January 11, 2018

ఆరుపదుల వయసులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారు. మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇందులో ఇటీవల కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించారు. యాక్షన్‌ స్టంట్లను సొంతంగా చేసి మోహన్‌బాబు అందరినీ ఆశ్చర్యపరిచారట. మోహన్‌బాబు చేసిన స్టంట్లకు ఆశ్చర్యపోయిన యాక్షన్‌ డైరెక్టర్‌ కనల్‌ కణ్ణన్‌ స్పందిస్తూ, 'మోహన్‌బాబు లాంటి పెద్ద ఆర్టిస్ట్‌ను డైరెక్ట్‌ చేయడం గొప్ప విషయమే. అద్భుతమైన స్టంట్స్‌తో కూడిన యాక్షన్‌ సన్నివేశాలను 67ఏండ్ల వయసులో కూడా ఆయన చాలా బాగా చేశారు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బాగా ప్లాన్‌ చేసి ఎలాంటి రిస్క్‌లు లేకుండా వీటిని తెరకెక్కిస్తున్నాం. ఎనిమిది రోజులపాటు ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది' అని తెలిపారు. వీటి కోసం ఆస్ట్రేలియా నుంచి స్టంట్‌మెన్‌ను పిలిపించారట. ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియా, నిఖిలా విమల్‌, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Don't Miss