అమ్మ నువ్వేక్కడ

18:13 - July 29, 2017

జగిత్యాల : పిల్లలను.. కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతల్లులే.. గాలికొదిలేశారు. నీడగా ఉండాల్సిన వారే.. నిర్ధాక్షిణ్యంగా..విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ చిన్నారులు మాత్రం.. తల్లులు కోసం బెంగపెట్టుకున్నారు..అమ్మ పలకరింపు కోసం... అల్లాడిపోయారు. ఆరు నెలల తర్వాత కనిపించిన అమ్మ దగ్గరకు వెళ్లాలని ఆ పసివాళ్లు తహతహలాడిపోయారు. ఆ తల్లులు మాత్రం.. కన్నపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. సారంగాపూర్‌ మండలం..కొనాపూర్‌ గ్రామంలో ...ఇద్దరు వివాహితులు ... భర్తలను విడిచిపెట్టి... పిల్లలను వదిలిపెట్టి ప్రేమించినవాళ్లతో వెళ్లిపోయారు.. కూలి పనులు కోసం వచ్చిన హరిబాబు, నాయుడు అనే ఇద్దరు అన్నదమ్ములతో... వివాహితులైన ఇద్దరు అక్కచెల్లెలు ప్రేమలో పడ్డారు. 8 నెలల క్రితం వీరి మధ్య పరిచయం ఏర్పడింది... హరిబాబు, నాయుడులతో రోజూ ఇద్దరు అక్క చెల్లెల్లు కూలి పనులకు వెళ్లేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఫిబ్రవరిలో నలుగురు ఊరివిడిచి వెళ్లిపోయారు.

నిరాశే ఎదురైంది
భార్యలు కనిపించకపోవడంతో... భర్తలు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నలుగురు వ్యక్తులు విజయవాడలో ఉన్నట్టు తెలుసుకుని.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచారు. అయితే వారు ఇష్టపూర్వకంగానే వెళ్లినట్టు ఇద్దరు మహిళలు చెప్పారని ... పోలీసులు తెలియజేశారు. ఆరు నెలలుగా తల్లులు కనిపించక... వారి పిల్లలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమ్మకోసం పరితపించారు. అయితే అమ్మ వస్తుందని కోర్టుకు వెళ్లిన చిన్నారులకు .. నిరాశే ఎదురైంది. కోర్టులో తమ తల్లులు కనబడగానే.. దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా దుఃఖభరితమయ్యారు. కానీ ఆ తల్లులు మాత్రం వారిని పట్టించుకోలేదు.. దీంతో ఆ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Don't Miss