దాసరిగడ్డలో నిరుపేదలపై మున్సిపాలిటీ అధికారుల జులుం

17:42 - March 20, 2017

భద్రాద్రి కొత్తగూడెం :. ఇల్లందు .. దాసరిగడ్డలోని నిరుపేద కుటుంబాలపై మున్సిపాలిటీ అధికారులు తమ జులుం ప్రదర్శించారు. ఇంటి పన్ను కట్టలేదంటూ.. నోటీసులిచ్చి.. ఇళ్లకు తాళం వేశారు. అంతేకాదు ఇళ్లలోని సామగ్రినంతా బయట పెట్టేశారు. పన్ను కట్టేందుకు సమయమివ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో పసిపిల్లలు..మహిళలతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

అధికారుల తీరుపై మండిపడ్డ బాధితులు....

అధికారుల జులుంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ బాధితులు.. వారి తీరుపై మండిపడ్డారు. ఇల్లందు మున్సిపల్‌ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. చంటి పిల్లలతో కలసి రాత్రి 11 గంటల వరకు ఆందోళన చేపట్టారు. వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి.. అక్కడే భోజనాలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామని.. కానీ ఎప్పుడు తమకు నోటీసులు రాలేదని బాధితులు వాపోయారు.. అకస్మాత్తుగా 17 వేలు పన్ను కట్టాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో బకాయిలున్న వ్యాపారులను అధికారులు ఏమి అనరని మా లాంటి వాళ్లను మాత్రం కష్టపెడతారని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన పాలకవర్గం...

ఈ విషయం తెలుసుకున్న పాలక పక్షం నేతలు.. ఇతర రాజకీయ పక్షాల నాయకులు తక్షణమే రంగంలోకి దిగారు. బాధితులకు భరోసా ఇస్తూనే అధికారుల తీరును తప్పుబట్టారు. పేదల పట్ల అధికారులు ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. అనంతరం బాధితులను సముదాయించి.. అధికారులు తీసుకున్న తాళాలను ఇప్పించారు. ఇళ్లకు పంపించారు.

Don't Miss