రాజస్థాన్‌లో గోరక్షణ పేరిట దాడి

18:25 - November 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌లో గోరక్షకులు మరోసారి రెచ్చిపోయారు. అల్వర్‌ జిల్లాలో ఆవులను తీసుకెళ్తున్న ఓ యువకుడిని కొట్టి చంపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానా-రాజస్థాన్‌ సరిహద్దులో శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆవులను తీసుకెళ్తుండగా గోరక్షకులు అడ్డుకుని దాడి చేశారు. ఆవులను తీసుకెళ్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఉమర్‌ మహ్మద్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ తాహిర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉంది. దాడికి పాల్పడ్డవారిలో 16 ఏళ్ల మైనర్‌ బాలుడు ఉన్నాడు. బాల నేరస్థుల చట్టం కింద ఈ బాలుడిని అరెస్ట్‌ చేశారు. ఈ బాలుడితో పాటు మరో ఆరుగురు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఉమర్‌ను తుపాకితో కాల్చి చంపారని బాధితుడి సన్నిహితులు చెబుతున్నారు.  భరత్‌పూర్‌ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్‌ మృతదేహాన్ని రామ్‌గఢ్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం గుర్తించినట్లు డీఎస్పీ అనిల్‌ బెనివాల్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ సాగుతోందని..మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జైపూర్‌కు పంపినట్లు వెల్లడించారు.

 

Don't Miss