చిన్నమ్మకే పగ్గాలు..

08:45 - January 1, 2017

చెన్నై : జయలలిత ఆశయం కోసం పని చేస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళానటరాజన్‌ అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జయలలిత మరణంతో అనాథలా మారామాని శశికళ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితం అమ్మకోసమేనని ఆమె స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్‌ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. పోయెస్‌ గార్డెన్‌ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి.. ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య నేతల సమక్షంలో పార్టీ చీఫ్ కుర్చీలో ఆమె కూర్చున్నారు.
'అమ్మ' ఆశయాలను నెరవేరుస్తాం : శశికళ 
జయలలితతో తన బంధం 33 ఏళ్లనాటిదని చిన్నమ్మ గుర్తు చేసుకున్నారు. జయలలిత మరణంతో అనాథలా మారామని శశికళ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల కోసమే అన్నాడీఎంకే ఉందన్నారు. జయలలిత మరణానంతరం శశికళ తొలిసారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవితం అమ్మకోసమేనని.. 'అమ్మ' ఆశయాలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. 'అమ్మ' మనతో లేకపోయినా అన్నాడీఎంకే పార్టీ వందేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తుందన్నారు. అమ్మే మన ధైర్యం, శక్తి అని శశికళ అన్నారు. జయలలిత ఎప్పటికీ పార్టీ కార్యకర్తల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఆమె స్థానం మరో వెయ్యేళ్లైనా ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆమె మరణాన్ని వూహించలేదని అమ్మ కోలుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చిందని వివరించారు.
జనరల్‌ సెక్రెటరీగా ఎన్నికైన రెండో మహిళ శశికళ
అన్నాడీఎంకే ఆరో జనరల్‌ సెక్రెటరీగా ఎన్నికైన శశికళ ఆ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ. ఆమె వయసు 62 సంవత్సరాలు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రులు, ఎమ్మెల్యేలు హారజయ్యారు. 

 

Don't Miss