దళిత విద్యార్థిని ఉసురుతీసిన నీట్...విద్యార్థుల ఆందోళన

16:12 - September 2, 2017

తమిళనాడు : నేషనల్‌ ఎలిజిబుల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడిన తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల దళిత విద్యార్థిని ఎస్‌.అనిత ఆత్మహత్యకు పాల్పడడంపై ఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు తమిళనాడులో ఆందోళన చేపట్టాయి. నీట్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. తన కూతురును కష్టపడి చదివించానని...నీట్‌ తన కూతురు ఉసురు తీసిందని అనిత తండ్రి ఆవేదన చెందారు.  నీట్‌ ఆధారంగానే మెడిసిన్‌ అడ్మిషన్లు తీసుకోవాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో... తనకిక మెడికల్‌ సీటు రాదనుకున్న అనిత శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  కుజుమూరు గ్రామానికి చెందిన అనితకు ఇంటర్‌లో 1200 మార్కులకు గాను 1176 మార్కులు వచ్చాయి.  నీట్‌ పరీక్షలో కేవలం 86 మార్కులే రావడంతో ఎంబిబిఎస్‌ సీటు పొందలేకపోయింది. నీట్‌ పరీక్షను ప్రామాణికంగా తీసుకోవద్దని, ఇంటర్‌ మార్కులను బేస్‌గా తీసుకుంటే తనకు మెడిసిన్‌లో సీటు వస్తుందని సుప్రీంకోర్టులో కేసు వేసింది. నీట్‌ను బిజెపి ప్రవేశపెట్టిందని ఈ ఘటనకు ఆ పార్టీనే బాధ్యత వహించాలని డిఎంకె డిమాండ్‌ చేసింది.

 

Don't Miss