ఎన్జీటీ షరతులు..వెనక్కి తగ్గిన కేజ్రీ సర్కార్..

06:47 - November 12, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో సరి-బేసి విధానాన్ని అమలు చేయలేమని కేజ్రీవాల్ ప్రభుత్వం చేతులెత్తేసింది. సరి-బేసి విధానం అమలుకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పలు షరతులు విధించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ వాహనాలు మినహా టూ వీలర్స్‌తో సహా అన్ని వాహనాలకు నిబంధన వర్తింప జేయాలని ఎన్‌జిటి ఆదేశించింది. దీని వల్ల సమస్యలు ఉత్పన్నమౌతాయని భావించిన కేజ్రీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ నెల 13 సోమవారం నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అమలు చేయాలనుకున్న సరి-బేసి విధానానికి బ్రేక్‌ పడింది. ఈ విధానంపై ఎన్‌జిటి పలు షరతులు విధించడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రకటించింది.

సరి-బేసి సంఖ్య విధానంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ విధానం అంత సరైంది కాదని చెబుతూనే కొందరికి ఎందుకు మినహాయింపు కల్పించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరి-బేసి విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే ఎన్‌జిటి పలు షరతులు విధించింది. అంబులెన్స్‌, ఫైర్‌, మున్సిపల్‌ చెత్తవాహనాలను మినహాయించి అన్ని వాహనాలకు ఈ విధానాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ద్విచక్రవాహనాలు, మహిళలకు కూడా ఈ నిబంధన తప్పనిసరి వర్తింప జేయాలని సూచించింది.

ఎన్‌జిటి ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం జరిపింది. గతంలో సరి-బేసి విధానాన్ని అమలు చేసిన సమయంలో వీవీఐపీలతో పాటు మహిళలకు, టూవీలర్స్‌కు, స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఇపుడు అన్ని వాహనాలకు సరి-బేసి విధానం అమలు చేస్తే తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తన నిర్ణయంపై పునర్విచారణ జరపాలని కోరుతూ ప్రభుత్వం- సోమవారం ఎన్‌జిటిలో రివ్యూ పిటిషన్‌ వేయనుంది. టూవీలర్స్‌, మహిళలకు మినహాయింపు నివ్వాలని ఎన్‌జిటిని కోరనుంది.

Don't Miss