నిందితులంతా నిర్ధోషులైతే, మరి దోషులెవరు?..

07:56 - April 17, 2018

హైదరాబాద్ : పదకొండు సంవత్సరాలు.. వందలాది మంది సాక్షుల విచారణ.. అయినా తేలని దోషులు. సుదీర్ఘకాలం సాగిన మక్కామసీదు పేలుళ్ల కేసులో ముద్దాయిలందరూ నిర్దోషులుగా బటయపడ్డారు. 10 మంది నిందితుల్లో ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏ సాక్ష్యాలు సేకరించలేక పోయింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్‌కోర్టు తీర్పు వెలువరించింది. కాగా తీర్పు చెప్పిన కొద్దిగంటల్లోనే జడ్జి.. రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు బాంబు పేలుళ్లు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసు మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరిగింది. స్థానిక పోలీసుల నుంచి సీబీఐ, ఎన్‌ఐఏ లాంటిసంస్థలు దర్యాప్తు చేశాయి. విచారణలో దాదాపు 226 మంది సాక్ష్యులను విచారించారు. ఒక్క ఎన్‌ఐఏ నే 411 డాక్యూమెంట్లను కోర్టుకు సమర్పించింది. వందల మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది. అయినా.. నిందితుల్లో ఏ ఒక్కరూ దోషులగా నిరూపణకాలేదు.

2007 మే 18 మక్కామసీదులో పేలుళ్లు ..
2007 మే 18 తేదీన మధ్యాహ్నాం సమయంలో మసీదులో అందరూ ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన పేలుళ్లలో 9 మంది మృతి చెందారు. అనంతరం ఘర్షణలు చెలరేగడంతో పోలీసు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 58 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఐఎస్‌ఐ ఏజెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని మొదట్లో పోలీసులు భావించారు. తొలుత హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్‌ పేలుళ్ల ఘటనపై కేసు నమోదయింది. విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేసును సీబీఐకి బదిలీ చేస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కేసును సీబీఐ నుంచి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి అప్పగించింది.

10మందిని నిందితులుగా గుర్తించిన ఎన్‌ఐఏ..
విచారణలో మొత్తం పదిమందిని నిందితులుగా గుర్తిస్తూ ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిందితులుగా ఉన్న వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన సునీల్‌ జోషి కేసు విచారణలో ఉండగానే హత్యకు గురయ్యాడు. ఇక రాజస్థాన్‌కు చెందిన ఆరెస్సెస్‌ ప్రచారక్‌ దేవేంద్రగుప్తా, మధ్యప్రదేశ్‌కు చెందిన లోకేశ్‌శర్మ, గుజరాత్‌కు చెందిన స్వామి ఆసిమానంద, మోహన్‌లాల్‌ రాతేశ్వర్‌, రాజేందర్‌ చౌదరిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ప్రచారక్‌ సందీప్‌ వి డాంగే, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రామ్‌చంద్ర కల్‌సాంగ్రా ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘ దర్యాప్తులో మొత్తం 226 మంది సాక్షులను విచారించిన ఎన్‌ఐఏ .. 411 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. వాటి ఆధారంగా నాంపల్లిలోని నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తుది రోజు తీర్పును వెల్లడించారు.

ఎలాంటి సాక్ష్యాలు సేకరించని దర్యాప్తు సంస్థలు..
కోర్టు తీర్పుతో తమ క్లయింట్లకు న్యాయం జరిగిందని నిందితుల తరపు న్యాయవాదులు అంటున్నారు. 11 ఎళ్ల పాటు విచారణ జరిపినా ఎలాంటి సాక్ష్యాలు కూడా న్యాయ స్థానం ముందు దర్యాప్తు సంస్థలు చూపించలేక పోయారన్నారు. నిందితులకు సంభంధం లేని ఆదారాలను మాత్రమే ఎన్ఐఏ కోర్టు ముందు ఉంచిందన్నారు. మరొ వైపు మక్కామసీదు పేలుళ్లలో బాధితులు మాత్రం కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీర్పు పై ఎన్‌ఐఏ హైకోర్టుకు వెళ్లాలని భాదితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తీర్పు వెలవరించిన అనంతరం సెషన్స్‌జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారంది. తన రాజీనమా లేఖను మెట్రోపాటిలన్‌ కోర్టు స్పెషల్ జడ్జికి పంపిన రవీందర్‌రెడ్డి..15రోజుల తాత్కాలిక సెలవులపై వెళ్లినట్టు తెలుస్తోంది. 

Don't Miss