'కూతురు మృతదేహం ఇవ్వండి'..

13:37 - February 13, 2017

హైదరాబాద్ : గతవారం అనారోగ్యంతో పోలెండ్‌లో మృతిచెందిన విద్యార్థిని నాగశైలజ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిలిపివేసింది. నాగశైలజకు పాస్‌పోర్టు లేదంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో పోలెండ్‌ నుంచి వచ్చిన గిరిజన విద్యార్థిని మృతదేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే నిలచిపోయింది. తమ కూతూరు మృతదేహాన్ని ఇవ్వాలని నాగ శైలజ కుటుంబ సభ్యులు కోరినా... పాస్‌పోర్టు లేనందున మృతదేహాన్ని ఇవ్వమని కార్గో అధికారులు తేల్చి చెబుతున్నారు.

మచిలీపట్నం..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా మచిలీపట్నంకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మీ కూతురు నాగ శైలజ. కొన్నాళ్ల క్రితం మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌లోని చందానగర్‌కు వచ్చి.. అక్కడే ఉంటున్నారు. 2012లో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో నాగ శైలజ బీటెక్‌ పూర్తి చేసింది. 2013లో మిథానిలో ఒక ఏడాది పాటు అప్రెంటీస్‌ చేసిన నాగశైలజ.. ఎంఎస్‌ చదవడం కోసం 2014లో పోలెండ్‌ దేశానికి వెళ్లింది. వచ్చే జూన్‌లో చదువు పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌ రావాల్సిన ఉన్న నాగ శైలజ.. 10 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ వారం క్రితం నాగ శైలజ చనిపోయింది. కుటుంబ సభ్యులు, పోలెండ్‌లో ఉన్న స్నేహితుల సహాయంతో నాగ శైలజ మృతదేహాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తెప్పించుకోగలిగారు. అయితే.. నాగ శైలజ మృతదేహం తీసుకొచ్చిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కారణంగా ఇప్పుడు మృతదేహం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే ఉంది. నాగ శైలజకు సంబంధించిన పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లను అందజేయకపోవడంతో కార్గో అధికారులు మృతదేహాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో నాగ శైలజ కుటుంబ సభ్యులో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Don't Miss