వైష్ణవి కేసు...8ఏళ్ల తరువాత తీర్పు...

15:52 - June 14, 2018

విజయవాడ : చిన్నారి నాగ వైష్ణవి హత్య కేసు...సుమారు ఎనిమిదేళ్ల అనంతరం తీర్పు వెలువడింది. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తున్న మహిళా సెషన్ కోర్టు న్యాయమూర్తి బబిత వెల్లడించారు.

2010 జనవరి 30న కారులో స్కూల్ కి వెళ్తున్న చిన్నారి నాగ వైష్ణవిని కిడ్నాప్ చేసి... గొంతు నులిమి హత్య చేసిన అనంతరం బాయిలర్‌లో వేసి దహనం చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. నాగవైష్ణవి హత్యతో పాటు అడ్డువచ్చిన డ్రైవర్ లక్ష్మణ రావును కూడా దారుణంగా కత్తులో పొడిచి హత్య చేశారు. తన ముద్దుల కూతురు హత్య వార్త విన్న తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు..నిరసనలు కొనసాగాయి. అందర్నీ కన్నీరు కార్చేలా ఈ కేసులో విచారణ జాప్యం జరుగుతుండడంతో తీవ్రంగా కలత చెందిన వైష్ణవి తల్లి కూడా కన్నుమూసింది.

ఈ కేసులో అరెస్ట్ అయిన ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్ గత ఏడేళ్లుగా జైలులో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే కేసు విచారణ పూర్తి కాగా... గురువారం తుది తీర్పు వెలువడింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Don't Miss