నాగర్ కర్నూల్ లో 'నాగం' సెగలు..

08:15 - June 6, 2018

నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్దనరెడ్డి చేరిక సెగలు ఇంకా చల్లారలేదు. ముందు నుంచి నాగంచేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ కూచికూళ్ల దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తనను కాదని నాగంగకు టిక్కెట్ కూడా ఖరారు చేయడంపై కూచికూళ్ల గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌లో తనకు భవిష్యత్తు లేదని కూచికూళ్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో కూచికూళ్ల దామోదర్‌రెడ్డి కినుక
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయనతో దశాబ్దాల వైరం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్‌లోకి వెళ్లే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉంటూ నాగర్‌కర్నూలు రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న దామోదర్‌రెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. ఉమ్మడి జిల్లాలో జిల్లాపరిషత్‌చైర్మన్‌గా ఉన్న కూచికూళ్ల.. ప్రస్తుతం నాగర్‌కర్నూలు కాంగ్రెస్ ఇంచార్జిగా కూడా ఉన్నారు. తనకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన నాగంకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత ఇవ్వాడాన్ని తమ నేత జీర్ణించుకోలేక పోతున్నారని దామోదర్‌రెడ్డి అనుచర వర్గం అంటోంది.

నాగంకే నాగర్‌కర్నూలు టికెట్‌ అనడంపై దామోదర్‌రెడ్డి అసంతృప్తి
నాగర్‌కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాగంకు హామీ ఇచ్చినట్టు వార్తలు రావడం, ఇదే విషయాన్ని నాగం కూడా ప్రచారం చేసుకోవడంతో దామోదర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కూడా కూచికూళ్ల ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇదే అవకాశంగా కూచికూళ్లను తమపార్టీలోకి ఆహ్వానించేందుకు గులాబీనేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఓ మంత్రి ద్వారా ఆయనతో మధ్యవర్తిత్వం నెరపినట్టు నాగర్‌కర్నూల్లో జోరాగ రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.

దామోదర్‌రెడ్డి పార్టీ మారకుండా డీకే అరుణ మంత్రాంగం
మరోవైపు దామోదర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారన్న సమాచారంతో కాంగ్రెస్‌ నేతలు రంగంలోకి దిగారు. కూచికూళ్ల పార్టీని వీడకుండా మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూలు సీటు తనకు లేదా తన వారసుడికి ఇస్తామని హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని... లేకపోతే తన దారి తాను చూసుకుంటానని దామోదర్‌రెడ్డి తెగేసి చెప్పినట్టు సమాచారం. కూచికూళ్ల అసంతృప్తిని చల్లార్చేందుకు నాగంతో హస్తం నేతలు ఓప్రకటన కూడా చేయించారు. అసెంబ్లీ టికెట్‌ ఎవరికి ఇచ్చినా తాను పూర్తిగా సహకరిస్తానని నాగం చెప్పడంతో దామోదర్‌రెడ్డి కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. మొత్తానికి కూచికూళ్ల - నాగం మధ్య ఆదిపత్యపోరు నాగర్‌కర్నూల్లో హస్తంపార్టీకి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.

Don't Miss