నాగం దారేటు...?

08:58 - July 22, 2017

నాగర్ కర్నూలు : నాగం జనార్దన్‌రెడ్డి... తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి ఏపీలో టీడీపీ తరుపున ఐదుసార్లు మంత్రిగా పని చేసిన నేత. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో సొంతపార్టీ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేత. ఆ తర్వాత నాగర్‌కర్నూలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెండ్‌గా నెగ్గి, తెలంగాణ వాణి వినించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీజేపీలో చేరిన నాగం, ఇప్పుడు కమలదళంలో ఎలా ఉన్నారు. ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారా ? ఈ విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నాగం బీజేపీలో సంతోషంగా ఏమీ లేరు. అపార రాజకీయ అనుభవం, సమస్యలపై చివరి వరకు పోరాడే తత్వం కల్గివున్న నాగం సేవలను కలమనాథులు పూర్తిగా వాడుకోలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు నాగంను ఎందుకు ఉపయోగించుకోలేక పోతున్నారన్నఅంశంపై కమలనాథులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

కావాలనే పక్కన పెడుతోంది
బీజీపీ నాయకత్వం కావాలనే నాగంను పక్కన పెట్టినట్టు చెప్పుకొంటున్నారు. తెలంగాణలో బలమైన సామాజికి వర్గానికి చెందిన నాగం జనార్దన్‌రెడ్డికి మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. కాస్త అవకాశం వస్తే దూసుకుపోయే తత్వం కల్గివున్న నాగం పట్ల బీజేపీ నాయకత్వ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోందని కమలనాథులే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అని పోరాడేందుకు నాగం సిద్ధంగా ఉన్నా... బీజేపీ నాయకత్వం ఏమాత్రం సహకరించడంలేదన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణ జలహారం, మిషన్‌ కాకతీయ, నాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి వంటి అంశాల్లో అవినీతి గురించిన నాగం మాట్లాడుతుంటే.... బీజేపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురయ్యారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యక్తిగతంగానే హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని నాగం సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. చాలా విషయాల్లో నాగంను నైతికంగా దెబ్బతీసే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తుండటంతోబాధపడుతున్నారు. కొందరు బీజేపీ నేతలు తాను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం చేస్తుండటంపై నాగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీలో నాగం ప్రయాణం అసంతృప్తితోనే సాగుతోంది. ఇదే కొనసాగితే తెలంగాణ కమలనాథులతో తాడో పేడో తేల్చుకునేందుకు కూడా నాగం సిద్ధంగా ఉన్నారని ఈయన సన్నిహితులు చెబుతున్నారు. తన దారి తాను చూసుకునేందుకు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. 

Don't Miss