బీజేపీకి నాగం గుడ్ బై ?

07:31 - January 12, 2018

హైదరాబాద్ : నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా? హస్తంగూటికి చేరేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారా? నాగం కమలంతో కటీఫ్‌ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారా? ఇంతకు నాగం కాంగ్రెస్‌ ఎప్పుడు చేరుతారు? వాచ్‌ దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ...
కాంగ్రెస్‌ గూటికి నాగం?
నాగం జనార్దన్‌రెడ్డి వైద్యవృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో నంబర్‌ టూగా ఉంటూ.. సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై చంద్రబాబుతో విభేదించి  టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ నగారా సమితి పెట్టారు. అంతగా ఆదరణలేకపోవడంతో  బీజేపీ కండువాకప్పుకున్నారు. కమలం పార్టీలో చేరిన నాటి నుంచీ నాగం జనార్దన్‌రెడ్డి అసంతృప్తితోనే  ఉంటూ వస్తున్నారు. 
అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నాగం
బీజేపీలోని అంతర్గతకుమ్ములాటలతో విసిగిపోయిన నాగం... చాలాసార్లు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీ అగ్రనాయకత్వంపై ఒకింత అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఇన్నాళ్లూ అయిష్టంగానే బీజేపీలో కొనసాగిన ఆయిన.. ఇక ఆ పార్టీని వీడాలని డిసైడ్‌ అయ్యారు.  త్వరలోనే కమలంపార్టీకి రాంరాం చెప్పేందుకు రెడీ అయ్యారు. అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించారు. కార్యకర్తల ఒత్తిడి, తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఉగాది తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తాని చెప్పారు.
వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ రోజురోజుకు బలం పెంచుకుంటోంది. రేవంత్‌రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌తో ఆ పార్టీ ఢీ అంటే ఢీ అంటోంది. కాంగ్రెస్‌ క్యాడర్‌లోనూ  నూతనోత్సాహం వచ్చింది.  దీంతో నాగం చూపు కాంగ్రెస్‌ వైపు మళ్లింది. కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైపాల్‌రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో హస్తం గూటికి చేరేందుకు తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూలు నుంచి నాగంను పోటీ చేయించాలన్న దానిపై కాంగ్రెస్‌ పెద్దలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
త్వరలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న నాగం
వాస్తవానికి ఈ నెలాఖరులోనే నాగం కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఫిబ్రవరి మొదటివారంలో రాహుల్‌గాంధీ తెలంగాణకు వస్తున్నారు. రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో  చేరాలని నాగం భావిస్తున్నారు. లేదంటే రేవంత్‌ తరహాలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ కప్పుకోవాలా అన్నది ఆలోచిస్తున్నారు. మొత్తానికి బీజేపీ జర్నీకి కటీఫ్‌ చెప్పాలని డిసైడ్‌ అయిన నాగం... ఇక హస్తం గూటికి చేరడమే తరువాయిగా మారింది. మరిరెండు రోజుల్లో ఎప్పుడు చేరుతారన్న దానిపై స్పష్టత రానుంది.

 

Don't Miss