నాగం చేరికపై టి.కాంగ్రెస్ లో చిచ్చు...

17:43 - January 27, 2018

మహబూబ్ నగర్ : ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఊపుమీదున్న కాంగ్రెస్‌లో... ఇప్పుడు ఆ చేరికలే సెగ రేపుతున్నాయి... పార్టీబలోపేతానికి పీసీసీ చేస్తున్న ప్రయత్నాలకు.... స్థానిక నేతల ఆదిపత్య పోరు అడ్డంకిగా మారింది. తాజాగా పాలమూరు జిల్లాలో చేరికల గొడవ హస్తినకు చేరడం కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్న వరంగల్‌.. నిన్న నల్గొండ జిల్లాల్లో రేగిన చేరికల లొల్లి... తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు పాకింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని నేతగా వెలిగిన నాగం జనార్దన్‌ రెడ్డి.... కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.. అందుకోసం సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి ద్వారా ఢిల్లీనుంచి లైన్‌ క్లియర్‌ చేయించుకున్నారు.

మార్చి నెలలో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు నాగం... కానీ ఆయన చేరికను ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వినిపిస్తున్న వ్యతిరేక గళానికి మాజీ మంత్రి డీకే అరుణ మద్దతు కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. నాగం చేరికను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్న డీకే అరుణ... నేతలను కూడగట్టి హస్తినలో మకాం వేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉంటూ.. ముఖ్య నేతల ముందు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉండి... కాంగ్రెస్‌ పార్టీపైనా, కార్యకర్తలపైనా పోరాటాలు చేసిన వారు... ఇప్పుడు తమ స్వార్థానికి కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీకే అరుణ వాదిస్తోంది. తమ కృషి వల్లే పార్టీ బలంగా ఉందంటున్నారు డీకే. మరోవైపు పీసీసీ ముఖ్యనేతలు డీకే అరుణ వాదనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాగర్‌ కర్నూలులో ఇప్పటివరకూ నాలుగు సార్లు పోటీ చేసి ఓడినా కూడా... దామోదర్‌రెడ్డికి జడ్పీ ఛైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌ పార్టీ కట్టబెట్టిందని గుర్తు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ గా గెలిపించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.

దామోదర్‌రెడ్డి తనకోసం కాకుండా తన కుమారునికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటే..... అందుకు అరుణ మద్ధతు పలకడం విడ్డూరంగా ఉందంటున్నారు పీసీసీ ముఖ్య నేతలు. నాగం లాంటి సీనియర్‌ నేత చేరికతో పార్టీకి ఉపయోగమే అంటున్నారు. కాబట్టి ఆయన రాకను అడ్డుకోవడం సరికాదన్న వాదన వినిపిస్తున్నారు. నాగం చేరిక అభ్యంతరాలపై స్పందించిన హై కమాండ్‌... పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను హస్తినకు పిలిపించి చర్చించినట్లు సమాచారం. మొత్తానికి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Don't Miss