ఎంపీ నంది ఎల్లయ్య ఎక్కడ ?

07:21 - February 9, 2018

నాగర్ కర్నూలు : రాజకీయాల్లో అపార అనుభవం.. గల్లీ నుంచి ఢిల్లీదాకా పెద్దలతో పరిచయాలు... అలాంటి నేతను గెలిపించుకుంటే ఇక తమ ఊళ్లు బాగుపడతాయనుకున్న ప్రజలకు నిరాసే ఎదురైంది. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒక్క అభివృద్ధి పనికూడా చేపట్టలేదు.. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య కోసం నియోజకవర్గ ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 
ఎల్లయ్య పనితీరుపై వ్యతిరేకత 
మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటులో ఆయా నేతల పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్య పనితీరుపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఎంపీ నంది ఎల్లయ్యపై విమర్శలు  
ఎంపీ నంది ఎల్లయ్య పట్టుమని పదిసార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన నాగర్‌కర్నూలు సెగ్మెంట్‌లో 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మందా జన్నాథంపై  కాంగ్రెస్‌ అభ్యర్థి నంది  ఎల్లయ్య గెలుపొందారు. నంది ఎల్లయ్య గెలుపుతో నారగర్‌కర్నూలు ప్రజలు సంతోషపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశించారు. కాని ప్రజలకు నిరాశే మిగిలింది. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీరు, విద్య, వైద్యం, రైల్వే లైన్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి. అభివృద్ధి మాట అటుంచి.. అసలు ఎంపీగారు నియోజకవర్గానికి చుట్టుపు చూపుగా కూడా రావడం మానేశారని ప్రజలు అంటున్నారు. గత నాలుగేళ్లలో ఎంపీ నంది ఎల్లయ్య పట్టుమని పదిసార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్న విమర్శలు వస్తున్నాయి. 
దత్తత గ్రామానికి నిరాశ
ఇదిగో ఈ గ్రామాన్ని చూడండి.. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు..గతుకుల రోడ్లు.. ఎండిపోయన బోర్లు. ఇంత అధ్వాన్న స్థితిలో ఉన్న ఈ గ్రామంపేరు అమరవాయి. గద్వాల నియోజకవ ర్గంలోని మల్దకల్‌ మండలంలో ఉన్న  అమరవాయి గ్రామాన్ని ఎంపీ నంది ఎల్లయ్య దత్తత తీసుకున్నారు. ఎంపీగారు దత్తత తీసుకోవడంతో ఇక తమ ఊరిలో అభివృద్ధి పరుగులు పెడుతుందనుకున్న వారికి నిరాశే మిగిలింది.  దత్తత తీసుకుని మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎంపీ గారు ఇప్పటివరకు ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
పట్టించుకునే నాథుడే కరువు 
ఎంపీ నంది ఎల్లయ్య అమరవాయిని దత్తత తీసుకున్న తర్వాత గ్రామాలోని పలు సమస్యల పరిష్కారానికి వ్యూహాలు  రూపొందించారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మహిళా కళాశాల, రైతులకు పంట నూర్పిళ్ల కోసం కల్లాలు, తాగునీటి పథకం, పశువైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, గ్రామంలో పాడుబడ్డ ఆరు ఊర బావులను పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ  ఏ ఒక్క సమస్య  కూడా  పరిష్కారానికి నోచుకోలేదు. 4,500 జనాభా ఈ గ్రామంలో   కనీసం 300 మరుగుదొడ్లు కూడా లేవు. వ్యక్తిగత నల్లాలు లేవు. ఊరు మొత్తంగా 30 మాత్రమే ఉన్నాయి. ఇన్ని సమస్యలతో సతమతమ వుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 
సమస్యలపై నంది ఎల్లయ్య దృష్టిపెట్టాలి : ప్రజలు  
మొత్తానికి ఎంపీ నంది ఎల్లయ్య తనను గెలిపించిన ప్రజలనే పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తుంటే.. ప్రతిపక్షపార్టీకి చెందిన నియోజకవర్గాల్లో కావాలనే అభివృద్ధి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఇప్పటికైనా గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలపై ఎంపీ నంది ఎల్లయ్య దృష్టిపెట్టాలని నాగర్‌కర్నూలు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 

 

Don't Miss