నాగోబా జాతరకు ఏర్పాట్లు...

10:42 - December 28, 2016

ఆదిలాబాద్ : తెలంగాణలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోభా జాతర. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా గిరిజనులు ఈ నాగోభా జాతరకు తరలివస్తారు. ఈ జాతర నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జాతర 
తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ లో నాగోబా జాతర జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు  జరుగనుంది. ఈ నేపథ్యంలో  జాతరను  ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ  జాతర ఏర్పాట్ల పై సెక్రటేరియట్ లో మంత్రులు  జోగు  రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి , అదిలాబాద్ ఎంపీ నగేష్ ఎమ్మెల్యేలు బాబురావు,రేఖ నాయక్,రసమయి బాలకిషన్, ఆయా శాఖల  ఉన్నతాధికారులతో పాటు అదిలాబాద్ ,మంచిర్యాల జిల్లాల కలెక్టర్ల తో గిరిజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ  మంత్రి చందులాల్  సమీక్ష నిర్వహించారు.
40 లక్షల విడుదల చేసిన సర్కార్ 
ఆదివాసీల ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలిరానుండడంతో అడవి తల్లి  పులకరించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. సమ్మక్క- సారలమ్మ జాతర తర్వాత పెద్దగా జరిగే నాగోబా జాతరకు ప్రాధాన్యత ఉందని మంత్రులు అన్నారు. వచ్చే జనవరి 27 నుండి ఫిబ్రవరి ఒకటి తేది వరకు జరిగే ఈ జాతర కు ప్రభుత్వం  40 లక్షల విడుదల చేస్తున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు.
జాతరకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు 
ఈ జాతరకు తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్ ,చత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇంద్రవల్లి మండలంలోని నాగోబా జాతరకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టామని మంత్రులు తెలిపారు. 
రూ. 2 కోట్లతో ధర్మసత్రం, దర్బార్ హాల్, ఇతర ఏర్పాట్లు
గిరిజనాభివృద్ది శాఖ నుంచి 2 కోట్ల రూపాయలతో ధర్మ సత్రం, దర్బార్ హల్ ,ఇతర ఏర్పాట్లును చేయనున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. మండల ఆధునీకకరణ, రాజగోపురం నిర్మాణాలు, దేవాలయ పునరుద్ధరణ కోసం కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న తెలిపారు.

 

Don't Miss