ఆదిలాబాద్ లో నాగోబా జాతర...

09:07 - January 17, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలో నాగోబా జాతర కోలాహలంగా సాగుతోంది. నాలుగు రాష్ట్రా నుంచి తరలి వచ్చిన గిరిజనులు తమ ఆరాధ్యదైవం నాగోబాకు భక్తి శ్రద్ధలో పూజలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ వాయిద్యాలతో నాగోబాకు ఘనంగా పూజలు జరుగుతున్నాయి.ప్రతిఏటా పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర వారం రోజుల పాటు కొనసాగుతుంది. పకృతితో పెనవేసుకున్న ఆదివాశీల సంస్కృతికి అసలు సిసలు ప్రతిరూపం ఈ నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర వెల్లిమండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా ఆలయం కొలువు దీరింది. ఇక్కడ మొస్రం తెగ గిరిజనులు మాత్రమే

నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నాలుగు తెగల ఆదివాసీలు ప్రధానంగా నోగోబాను పూజిస్తారు. అయితే గిరిజనేతరులు కూడా పెద్ద సంఖ్యలో నాగేంద్రుణ్ని దర్శించుకుని మొక్కలు తీర్చుకుంటారు పుష్యమాసం ప్రారంభం నుంచి నెలవంక కనిపించిన రెండో రోజున మొస్రం తెగ గిరిజనులు కేస్లాపూర్‌లో సమావేశమవుతారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన మొదటి రోజే గిరిజనులంతా తమ ఇంళ్లు, వాకిళ్లూ అందంగా అలంకరించుకుంటారు. మరుసటి రోజు ఇచ్చోడ మండలం సిరికొండలోని కుమ్మరులకు కుండలు చేయమని చెప్పి వస్తారు. నాగోబా పూజలో కీలకమైన కుండలను సిరికొండ గ్రామానికి చెందిన కుమ్మరి వంశస్తులే తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కుండలు తయారైన తర్వాత పుష్యపౌర్ణమి నాడు మొస్రం తెగవారంతా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. పూజాకలశాలు తీసుకొని గోదావరి నది పవిత్ర జలాలను తీసుకు రావడానికి బయలుదేరుతారు. కేస్లాపూర్ నుంచి సుమారు 80 కి.మీ. దూరం నడిచి గోదావరి తీరానికి వెళ్తారు. ఈ ప్రయాణంలో ఊరి పొలిమేరల్లో మాత్రమే వారు బస చేస్తుంటారు.

నాలుగు రోజుల్లో జన్నారం మండలం కలమడుగు గ్రామ ప్రాంతంలో గోదావరి తీరం చేరతారు. ఇక్కడ అస్తాన్ మడుగు దగ్గర గల పంచలింగాలకు పూజ చేస్తారు. అక్కడి గోదావరి జలం తీసుకొని తెల్లవారక ముందే ఆ ప్రాంత పొలిమేరలు దాటుతారు. మళ్లీ కాలినడకన తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. మార్గమధ్యంలో ఏ ఊరిలోకి ప్రవేశించకుండా అటవీప్రాంతం నుంచి నడక సాగిస్తారు . గోదావరి జలాలతో ఊరిలోకి ప్రవేశించరాదన్న నియమాన్ని పాటిస్తారు. కేస్లాపూర్‌ చేరుకున్న తర్వాత.. అక్కడ నుంచి మంగళవాయిద్యాలతో నీటి కలశాలను నాగోబా ఆలయానికి చేరుస్తారు. మరోవైపు మిగతా గిరిజనులు అంతా అమావాస్య రోజు సాయంత్రానికి ఎడ్లబండ్లలో ఆలయం పరిసరాలకు చేరుకుంటారు. మొస్రం తెగ ఆడపడుచులు, అల్లుళ్లు వరుస క్రమంలో నాగోబా ఆలయాన్ని శుభ్రపరిచి, నీళ్లతో కడుగుతారు. ఆలయంలోని మట్టితో గద్దె వేస్తారు. ఈ గద్దె వేయడాన్ని 'భోవ్‌లా వాట్‌వాల్' పిలుస్తారు. గద్దె వేసిన మరుసటి రోజు నుంచి వారం రోజుల పాటు ఇష్టదైవం నాగేంద్రుడికి వివిధ రీతుల పూజలు నిర్వహిస్తారు.

Don't Miss