వికీమేనియాకు తెలుగు కుర్రాడు..

22:21 - June 17, 2016

హైదరాబాద్ : ఇటలీలో జరిగే వికీపీడియా అంతర్జాతీయ సదస్సు.. మికీమేనియా 2016కు తెలంగాణకు చెందిన ప్రణయ్‌రాజ్‌ వంగరి ఎంపికయ్యారు. గడచిన మూడు సంవత్సరాలుగా ప్రణయ్‌రాజ్‌ చేస్తున్న కృషిని గుర్తించిన వికీమీడియా ఫౌండేషన్‌.. ఆయనకీ అరుదైన గౌరవాన్ని అందించింది.

వికీపీడియాకు మూడేళ్లుగా తెలుగు వ్యాసాలు రాస్తున్న ప్రణయ్‌..
వికీపీడియా.. ! ఇంటర్నెట్‌తో కొద్దిపాటి పరిచయం ఉన్నవారికైనా చిరపరిచితమైన సెర్చ్‌ ఇంజన్. ఏ అంశంపై వివరాలు కావాలన్నీ.. వికీపీడియానే ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 64వేలకు పైగా వ్యాసాలున్నాయి. అట్లాంటి వికీపీడియాకు.. నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్‌రాజ్‌ వంగరి, మూడేళ్లుగా తెలుగు వ్యాసాలు రాస్తూ వస్తున్నాడు. అతడి కృషిని గుర్తించిన వికీపీడియా సంస్థ ఈఏడాది ఇటలీలో నిర్వహించే వికీమేనియా 2016 అంతర్జాతీయ సదస్సుకు ప్రణయ్‌రాజ్‌ను ఎంపిక చేసింది. జూన్‌ 22 నుంచి 26 వరకూ ఇటలీలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 550 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో పాల్గొనే అపురూపమైన అవకాశం తెలంగాణ కుర్రాడైన ప్రణయ్‌రాజ్‌ను వరించడం విశేషం. ప్రణయ్‌రాజ్‌కు చాలా చిత్రమైన పరిస్థితుల్లో వికీపీడియాతో అనుబంధం ఏర్పాటైంది. థియేటర్‌ ఆర్ట్స్‌లో పీజీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంఫిల్‌ చేస్తున్న ప్రణయ్‌.. తన కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం వికీపీడియాలో అన్వేషించి.. అది లభ్యం కాకపోవడంతో.. తనలాగే మరొకరు ఈ అంశంలో ఇబ్బంది పడరాదని వికీపీడియన్‌గా మారారు.

30 మంది చురుకైన వికీపీడియన్లలో.. ప్రణయ్‌రాజ్‌ ..
తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం రాస్తున్న 30 మంది చురుకైన వికీపీడియన్లలో.. ప్రణయ్‌రాజ్‌ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రథమ స్థానంలో ఉన్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌కే పరిమితం కాకుండా.. గ్రామాలు, చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు, సినిమా తదితర అంశాలకు సంబంధించిన వ్యాసాలూ రాశారు. తెలంగాణకు సంబంధించిన సమాచారం వికీపీడియాలో చాలా తక్కువగా ఉందని.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వ్యక్తుల గురించిన వ్యాసాలను వికీపీడియాలో రాసే పనిలో ఉన్నారు ప్రణయ్‌రాజ్‌. ఈ ప్రయత్నంలో మరికొంత మంది ఔత్సాహికులు వికీ వ్యాసాల రచనకు ముందుకు వస్తే బావుంటుందని ప్రణయ్‌ కోరుతున్నారు. అంతేకాదు.. ఉత్సాహవంతులకు తగిన శిక్షణలూ ఇస్తూ వస్తున్నారు.

Don't Miss