మక్కా మసీదు కేసు కొట్టివేత..పూర్వాపరాలు..

13:14 - April 16, 2018

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి న్యాయస్థానం కొట్టివేసింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి ఆసీమానంద, భరత్ భాయి, రాజేందర్ చౌదరిలపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

పూర్వాపరాలు..
చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ఆవరణలోల గల బాంబు పేలడంతో 9మంది మృతి చెందారు. 58మంది గాయపడ్డారు. 2007 మే 18వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు అనంతరం జరిగిన అలర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతి చెందారు. ఘటన తీవ్రతతో దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ నేపథ్యంలో 2011 ఏప్రిల్ 4వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థకు భారత హోం మంత్రిత్వ శాఖ అప్పగించింది. మొత్తం పదిమంది నిందితులను ఎన్ఐఏ గుర్తించింది. 2014 ఫిబ్రవరి 13న నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. నవంబర్ 19వ తేదీన కీలక నిందితుడు నాబకుమార్ సర్కార్ అలియాస్ ఆసీమానంద చిక్కడంతో కుట్రకోణం వెలుగు చూసినట్లైంది. ఈ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న రతేశ్వర్ అలియాస్ భారత్ భాయి, మధ్యప్రదేశ్ కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ పోలీసులకు చిక్కారు. సందీప్ వి డాంగే, రామచంద్ర కల్సంగ్రా రాంజీ లు ఇంకా దొరకలేదు. మరో నిందితుడు సునీల్ జోషి పేలుడు జరిగిన ఏడాదే హత్యకు గురయ్యాడు. 

Don't Miss