వైష్ణోదేవి ఆలయ దర్శనంపై ఎన్జీటీ నిబంధనలు

22:02 - November 13, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ క్షేత్రం వైష్ణోదేవి ఆలయ దర్శనంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ నిబంధనలు విధించింది. ఇకపై రోజుకు 50వేల మంది భక్తులను మాత్రమే వైష్ణోదేవి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. పరిమితికి మించిన భక్తులను అర్ధకువారీ లేదా కత్రా వద్ద ఆపివేస్తామని ఎన్‌జీటీ పేర్కొంది. రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ సామర్థ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌జిటి పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఎన్‌జీటీ స్పష్టం చేసింది. నవంబర్‌ 24న వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే కొత్త మార్గాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇది కేవలం పాదచారులు, బ్యాటరీ కార్లకు మాత్రమేనని.. గుర్రాలపై వెళ్లేందుకు ఈ కొత్త రహదారిపై అనుమతి లేదని స్పష్టం చేసింది. వైష్ణోదేవి ఆలయాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 69.34లక్షల మంది భక్తులు సందర్శించారు.  ప్రకృతి విపత్తులు, ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గినట్లు సమాచారం.

 

Don't Miss