ఎన్జీటీలో కేజ్రీ సర్కార్ మరో పిటిషన్...

21:20 - November 14, 2017

ఢిల్లీ : సరి-బేసి విధానం అమలులో భాగంగా, మహిళలకు, టీ వీలర్స్‌కు మినహాయింపు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్‌ను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తోసిపుచ్చింది. టూవీలర్స్‌కు, మహిళలకు మినహాయింపు నివ్వడం కుదరదని...అందరికీ అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. కాలుష్యాన్ని వెదజల్లే ద్విచక్రవాహనాలకు మినహాయింపు నివ్వడం సరికాదని పేర్కొంది. టూ వీలర్స్‌ను నిషేధిస్తే 35 లక్షల మంది ప్రయాణికుల అదనపు భారం ప్రభుత్వంపై పడనుందని...ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేమని... పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళకు భద్రత కల్పించలేమని ఢిల్లీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన ఎన్‌జిటి- మహిళల కోసం ప్రత్యేక బస్సులు, మెట్రోలో మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో సరి-బేసి విధానంపై ఎన్‌జిటి శనివారం ఇచ్చిన తీర్పును పునర్విచారణ జరపాలన్న పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ అంశంలో ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. సరి-బేసి విధానం అమలులో భాగంగా విఐపిలు, మహిళలు, టూ వీలర్స్‌కు మినహాయింపు ఇవ్వొద్దని ఎన్‌జిటి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సరి బేసి విధానాన్ని మరిన్ని రాష్ట్రాలకు విస్తరింప జేయాలని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కొత్త పిటిషన్‌ దాఖలు చేసింది.

Don't Miss