మజ్నూ రివ్యూ..

18:41 - September 23, 2016

నేచురల్ స్టార్ నాని, మలయాళ భామ అను ఇమాన్యువేల్ జంటగా నటించిన వెరైటీ ప్రేమకథాచిత్రం మజ్నూ. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో నాని ఈ సంవత్సరం హ్యాట్రిక్ కొట్టాడా? లేదా?

నానిని తనను నేచురల్ స్టార్ అని ఎందుకంటారో ఇప్పటివరుకూ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం తన యాక్టింగ్ టాలెంట్ తో కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా సినిమాను హిట్టు గట్టెక్కించగలడు . అదే హిట్టైతే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో , లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ తో నిరూపించాడు. ఇప్పుడు మజ్నూ విషయానికొస్తే , కథ పాతదే అయినా, కథనాన్ని తనదైన యాక్టింగ్ తో మసిపూసి మారేడు కాయ చేసేసాడు. సినిమా స్టోరీ, తరువాత ఏం జరుగుతుందో అందరూ ఎక్స్ పెక్ట్ చేసేదే, కాకపోతే హాయిగొలిపే సన్నివేశాలతో , బోర్ కొట్టించని నెరేషన్ తో ఈ సినిమాని బ్యాలెన్స్ డ్ గా తెరకెక్కించాడు విరించి వర్మ. అసలు నాని ప్రేమకథాచిత్రాలు చేసే స్థాయి ఎప్పుడో దాటిపోయాడు గానీ, ఈ సినిమాలో నాని హీరో అవడం వల్ల కథనానికే బలమొచ్చి, జనానికి కాస్తంత రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. అదే వేరే ఇతర హీరోలెవరైనా ఈ సినిమా చేసి ఉండుంటే మాత్రం ఓ మామూలు రొటీన్ సినిమాలా మిగిలిపోయి ఉండేదేమో.

తన ప్రాణ స్నేహితుడు కాశి ప్రేమవ్యవహారం సెట్ చేద్దామని బైలుదేరిన ఆదిత్య, కిరణ్ అనే ఆ అందమైన అమ్మాయిని చూసి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను రోజూ ఫాలో చేస్తూ అనుకోకుండా ఆమె చదివే కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు. కొద్దిరోజులకు ఇద్దరి మధ్యా ప్రేమముదిరి పాకాన పడుతుంది. అయితే కాశీతో ఆదిత్య తనకన్నా బాగా క్లోజ్ గా ఉండడాన్నిభరించలేకపోతుంది కిరణ్. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరుగుతాయి. దాంతో ఆమె మీద కోపంతో ఆమెను వదిలిపెట్టి వేరే ఊరు వెళ్లిపోతాడు. అక్కడ సుమ అనే మరో అమ్మాయికి ఆకర్షితుడై , ఆమెను తన ప్రేమలో పడేస్తాడు ఆదిత్య.అయితే తను ప్రేమిస్తున్న విషయాన్ని ఆదిత్య కు చెబుతూ, తనతో పాటే కిరణ్ ని తన కజిన్ గా పరిచయం చేస్తుంది సుమ. ఇద్దరి మధ్యా చిక్కుకున్న ఆదిత్య చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్నదే మిగతా కథ.

ఇలాంటి రొటీన్ కథను చివరి వరుకూ బోర్ కొట్టించకుండా నడిపించాలంటే ఎలాంటి డైరెక్టర్ కైనా కత్తి మీద సామే. అయితే డైరెక్టర్ మంచి మంచి సన్నివేశాలు రాసుకోవడం వల్ల, అందరూ మాట్లాడుకొనే సాధారణమైన సంభాషణల్ని పలికించడం వల్ల, అసలు ప్రేక్షకులకు టైమే తెలియకుండా పోతుంది . నాని తనదైన నటనా చాతుర్యంతో ,సంభాషణా చమత్కృతులతో ఈ సినిమా ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. ఇక హీరోయిన్స్ గా నటించిన ఇద్దరమ్మాలు బాగా నటించడంతో సినిమా బాగానే సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా పడుతుంది. ప్రేమ విఫలమైనవాళ్లంతా మజ్నూలు అవ్వక్కర్లేదని, ప్రేమ నిజమైతే ఎవరూ మజ్నూలు కానవసరం లేదని విరించి వర్మ కొత్తగా చెప్పడానికి ట్రై చేసాడు. అయితే ఈ తరహా సినిమాల్ని మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. మామూలు మాస్ ప్రేక్షకుడు ఎంతవరుకూ ఇష్టపడతాడో చెప్పలేం. క్లైమాక్స్ ను చాలా బ్యాలెన్స్ డ్ గా, ఫన్నీగా తెరకెక్కించాడు దర్శకుడు. టోటల్ గా సినిమా మరీ దారుణం లేకుండా , అలా అని మరీ సూపర్ గా కాకుండా, చూడ్డానికి బాగానే ఉంటుందనే కన్ క్లూజన్ కు వస్తారు ప్రేక్షకులు . ఈ వారం సినిమాలేవీ లేవు కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే పాసైపోతుంది. 

Don't Miss