'కత్తి' పట్టమంటున్న క్షురకులు...

06:40 - June 18, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో నాయీ బ్రాహ్మణుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె విరమించేదిలేదని క్షురకులు తేల్చి చెబుతున్నారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని ఏపీలో నాయీ బ్రాహ్మణులు తేల్చి చెప్పారు. ఏపీలో క్షురకులు చేపట్టిన సమ్మె మూడవరోజుకు చేరుకుంది. ఈ సమ్మెతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వానికి వెంట్రుకల వ్యాపారమే తప్ప క్షురకుల సంక్షేమం అవసరంలేదని నాయీ బ్రాహ్మణులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు విజయవాడ దుర్గగుడిలో నాయీ బ్రాహ్మణుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తేనే సమ్మె విరమిస్తామని నాయిబ్రాహ్మణులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం పిలిచే చర్చలకు తాము వెళ్తామని, చర్చలు ఫలించని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అటు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నాయీ బ్రాహ్మణుల సమ్మె కొనసాగుతోంది. నెలకు 15వేల రూపాయల జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమండ్‌ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే గ్రామస్థాయిలో నాయీ బ్రాహ్మణ పనిని నిలిపి వేసి సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. కత్తి డౌన్‌ కార్యక్రమానికి సీఐటీయూ సంఘీభావం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయీ బ్రాహ్మణుల సమ్మెతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి శాంతియుతంగా సమ్మె జరపాలని అధికారులు సూచిస్తున్నారు. 

Don't Miss