విశాఖలో ప్రారంభమైన ఏపీ ఇన్నోవేషన్‌ అంతర్జాతీయ సదస్సు

09:31 - September 10, 2017

విశాఖ : అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శనకు విశాఖపట్నం వేదికైంది. నగరంలో ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్ ఫెయిర్‌ ఘనంగా ప్రారంభమైంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు... తమ నూతన ఆవిష్కరణలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. 

విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరగనున్న... అంతర్జాతీయ ఆవిష్కరణ ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. ఐఎఫ్ ఐఏ అధ్యక్షుడు అలిరేజా రస్టెగర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 150 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారు రూపొందించిన కొత్త పరికరాలను... కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగకరంగా ఉండే ఆవిష్కరణలను ప్రదర్శించి... వాటి గురించి వివరించారు. 

ఈ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు... అందరినీ అబ్బురపరిచాయి. ప్రధానంగా  తక్కువ ఖర్చుతో లిఫ్ట్‌ను అమర్చగలిగే కొత్త విధానం... రెండు గంటల్లో రెండు ఎకరాలకు నాట్లు పెట్టే వ్యవసాయ మిషన్‌ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. 

అలాగే మట్టి లేకుండా వాటర్‌ ద్వారానే మొక్కలు పెంచే విధానం అందరినీ ఆకర్షించింది. కొత్త టెక్నాలజీతో... తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగకరంగా ఉండే.. నూతన పరికరాలను ఆకట్టుకున్నాయి. నగరవాసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనను తిలకించారు. ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని... విద్యార్థులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

ఈ ప్రదర్శనలో 30 మంది వివిధ దేశాల ప్రతినిధులు, 50 దేశీయ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆదివారం మంత్రి నారా లోకేశ్‌  హాజరుకానున్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరై ప్రదర్శననుద్దేశించి ప్రసంగించనున్నారు. 

Don't Miss