రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్..విపక్షాలకు చుక్కెదురు...

19:33 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో విపక్షాలకు చుక్కెదురైంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ విపక్షాల తరపున పోటీచేసిన హరిప్రసాద్‌పై 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. కొత్త డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ పేరును రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ విజయం సాధించారు. విపక్షాల తరపున పోటీ చేసిన కాంగ్రెస్‌ ఎంపీ హరిప్రసాద్‌పై 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రాజ్యసభలో మొత్తం 244 మంది సభ్యులుండగా 230 మంది హాజరయ్యారు. ఎన్డీయేకు 125 ఓట్లు, విపక్షాల అభ్యర్థికి 105 ఓట్లు వచ్చాయి. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డిప్యూటి చైర్మన్‌గా ఎన్నికైనట్లు సభాపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు.

ఈ ఎన్నికలో 14 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో సంఖ్యాబలం 230కి తగ్గింది. దీంతో విజయలక్ష్యం 119 నెంబర్‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌, వైసిపి, డిఎంకె, టిఎంసి, పిడిపిలకు చెందిన ఇద్దరేసి సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆప్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఎస్పీ ఎంపి జయబచ్చన్‌ కూడా గైర్హాజరయ్యారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హరివంశ్‌ మంచి విద్యావంతుడని... సభను హుందాగా నడిపే సమర్ధత హరివంశ్‌కు ఉందన్నారు.

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపికైన జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను విపక్షాలు అభినందించాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం సర్వసాధారణమని..రాజ్యాంగ బద్దమైన పదవికి ఎంపికైన వ్యక్తులు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ పక్షనేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. హిందీ భాష అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారని కొనియాడారు. ఓ జర్నలిస్ట్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం వల్ల మీడియాలో సభ కార్యకలాపాలకు చెందిన వార్తలు ఎక్కువగా వస్తాయని నవ్వుతూ చెప్పారు.

పార్లమెంట్‌ సభ్యుడిగా హరివంశ్‌ పనితీరుపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. రచయిత, సంపాదకుడు, బ్యాంకర్, రాజకీయ కార్యకర్తగా ఎంతో అనుభవం గడించిన ఆయన ఏ విషయమైనా రిసెర్చ్‌ చేసి చర్చించే వారని ఆయన తెలిపారు. హరివంశ్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం ద్వారా సభా హుందాతనం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. కిడ్నీ ప్లాంటేషన్‌ చేయించుకున్న తర్వాత జైట్లీ తొలిసారిగా పార్లమెంట్‌కు హాజరయ్యారు.

తనని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎన్నుకున్నందుకు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను నిష్పక్షపాతంగా సభను నడిపిస్తానని హామి ఇచ్చారు. ఈ పదవిని చేపట్టడం తనకు కొంత భయంగానే ఉందని... రాజ్యసభలో ఎందరో అనుభవజ్ఞులున్నారని వారి సూచనలతో సభను హుందాగా నడిపిస్తానని హరివంశ్‌ పేర్కొన్నారు.

హరివంశ్‌కు ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు బిజెడి, టిఆర్‌ఎస్‌, శివసేన మద్దతు తెలిపాయి. డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సభ్యులు మద్దతు ఇచ్చినందుకు బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ సహకారం ఉంటుందని నితీష్‌ అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎస్పీ, బిఎస్పీ, ఎన్‌సిపి, టిఎంసి, టిడిపి, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఎన్డీయే అభ్యర్థిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమైనప్పటికీ ఫలితం దక్కలేదు.

Don't Miss