గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొత్త హంగులు

09:26 - January 12, 2017

విజయవాడ : అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకొంటున్న విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు సరికొత్త హంగులతో అందుబాటులోకి వస్తోంది. దేశ విదేశాలకు మరిన్ని సర్వీసులు ఇక్కడి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ పోర్ట్‌లో నూతనంగా నిర్మించిన టెర్మినల్‌ను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ప్రారంభించనున్నారు. 
నూతన టెర్మినల్ ముస్తాబు
విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, విశాలమైన భవన సముదాయం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేట్లు చిత్రాలు, సౌకర్యవంతమైన విశ్రాంతి గదులతో నూతన టెర్మినల్ భవనం ముస్తాబైంది. 
సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులచే ప్రారంభం 
గురువారం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు ఈ నూతన టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. దీంతో విమాన రాకపోకలు భారీగా పెరిగే అవకాశముందని విజయవాడ ఎంపీ కేశీనేని నాని తెలిపారు. 
13 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం 
ఈ  నూతన టెర్మినల్ 13 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేవలం 14 నెలల రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తయ్యింది. దీనికోసం 128 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ టెర్మినల్‌ గ్రౌండ్ ఫ్లోర్ లో చెక్ ఇన్ ఏరియా, సెక్యూరిటీ హోల్డ్ ఏరియా, ఎరైవల్ హాల్, జనరల్ ఏవియేషన్ లాంజ్, డోలి పార్కింగ్ అండ్ బ్యాగేజ్ మెక్ ఆఫ్ ఏరియా, కవర్డ్ గ్రీన్ ఏరియాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్ కార్యాలయాలు, సర్వీస్ జోన్, మరో జనరల్ ఏవియేషన్ లాంజ్ లు నిర్మించారు. 
నూతన టెర్మినల్‌లో చాలా ప్రత్యేకతలు
ఈ టెర్మినల్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. రద్దీ సమయాల్లో ఒకేసారి 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా టెర్మినల్ నిర్మాణం చేశారు. ప్రయాణికులకు వేగవంతమైన సేవలందించేందుకు డిపార్చర్ బ్లాక్ లో 18 చెక్ ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 3,613 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని జనరల్ ఏవియేషన్ లాంజ్ ఏరియాల్లో వీవీఐపీల కోసం ఒక సెర్ మోనియల్ లాంజ్, వీఐపీల కోసం మరో రెండు విశ్రాంతి గదులు, అదనంగా మరో సూట్ రూమ్ ను నిర్మించారు. డిపార్చర్ లో మరో లాంజ్ ను ఏర్పాటు చేశారు. 
10 లక్షల మంది ప్రయాణ సౌకర్యం
గన్నవరం ఎయిర్‌పోర్టులోని పాత టెర్మినల్ 3200 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి ఏటా 2 లక్షల 50 వేల మంది ప్రయాణీకులకు మాత్రమే వసతలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులోకి రానున్న కొత్త టెర్మినల్ 9  ఏడాదికి 10 లక్షల మంది పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో వసతులు అందుబాటులోకి రానున్నాయి.   

 

Don't Miss