బీజేపీకి షాక్‌ ఇచ్చిన గడ్కరి...

20:12 - October 10, 2018

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఓ నేత చేసిన వ్యాఖ్యలతో ఆపార్టీ ఇరకాటంలో పడింది. బీజేపీని ఇంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిన వ్యక్తి ప్రతిపక్ష నేతకాదు.. ఇంతకు ఎవరా నేత..? అసలేమన్నారు..బీజేపీ ఆచరణకు అమలుకాని హామీలిచ్చింది. ఆ హామీలు ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించాయి. వాటిని నెరవేర్చే ప్రయత్నం ఇంతవరకూ జరగలేదు. ఈ మాటలన్నది ప్రతిపక్ష నేతకాదు.. స్వయంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ..కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సొంత బీజేపీ ప్రభుత్వాన్నే తీవ్ర ఇరకాటంలో పడేశారు. కమలనాథులపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ చేతికి స్వయంగా మరో అస్త్రాన్ని అందించారు. గడ్కరీ వ్యాఖ్యలతో మోదీ, అమిత్‌ షా ద్వయమే కాదు కమలదళమంతా తలలు పట్టుకుంటుంటే... కాంగ్రెస్‌ ఇదే అవకాశంగా తూర్పారబడుతోంది. ఓ చానల్‌లో ప్రసారమైన 'అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే' అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానాతో సంభాషిస్తూ గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఈనెల 4, 5 తేదీల్లో రెండు భాగాలుగా ప్రసారమైంది. 'రాజకీయాలు సినిమా కలిసిన వేళ' పేరిట మొదటి భాగం, 'నానా-నితిన్‌ మధ్య చమత్కారం' పేరిట రెండో భాగం ప్రసారమయ్యాయి.''మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నామని చెప్పుకొచ్చారు నితిన్‌ గడ్కరీ. గడ్కరీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురించి ఈ వ్యాఖ్యలు చేశారా ? లేక మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం గురించి చేశారా ? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే గడ్కరీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

Don't Miss