ప్రశ్నార్థకంగా నిజాం షుగర్స్ ..

14:05 - December 25, 2016

నిజామాబాద్ : నిజాం షుగర్స్‌కు సంకెళ్లు పడి ఏడాది పూర్తయినా...పరిశ్రమ తెరుచుకోలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే..వంద రోజుల్లోనే ఫ్యాక్టరీలను తెరుస్తామన్న కేసీఆర్ మాటలు..కాగితాలకే పరిమితమయ్యాయి. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనుకున్న కార్మికుల ఆశలు..అడియాశలుగానే మిగిలాయి.

ఆసియా ఖండంలోనే పేరుగాంచిన నిజాం షుగర్స్...
ఆసియా ఖండంలోనే పేరుగాంచిన నిజాం షుగర్స్... ఇప్పుడు రాష్ట్ర ప్రజలే మరిచిపోయే స్థితికి చేరుకుంది. నిత్యం కార్మికులతో కళకళలాడిన పరిశ్రమ..శిథిలావస్థలో చితికిపోతోంది. తాము అధికారంలోకి వస్తే పూర్వవైభవం తీసుకొస్తామంటూ ప్రకటించిన నేతలు...ఆ సంగతే మర్చిపోయారు. దీంతో పరిశ్రమనే నమ్ముకొని బతికిన కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయి.

ఫ్యాక్టరీలను పునరుద్దరిస్తామని కేసీఆర్ హామీ..మరిచిపోయిన ప్రభుత్వం
నిజాంఘగర్ ప్యాక్టరీని యాజమాన్యం... 2015 డిసెంబర్ 23న చెరుకు, నీటి లభ్యత లేదని లేఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసింది. అయితే 2015 జనవరి 5న సీఎం కేసీఆర్, రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వమే ఫ్యాక్టరీలను నడిపించాలని రైతులు డిమాండ్‌ చేయడంతో..సీఎం సమ్మతించారు. తరువాత ఆ సంగతే మరిచిపోయి పాత పాటనే పాడింది. దీంతో రైతులు, కార్మికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రే మాట మీద నిలబడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం
ఈ ఏడాది క్రషింగ్ సీజన్లో ఫ్యాక్టరీని ప్రభుత్వం పునరిద్దిరిస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపించలేదని ప్రకటించడంతో.. తీవ్ర నిరాశకు గురయ్యారు. పరిశ్రమలను నడిపిస్తామని చెప్పి...సాక్షాత్తు ముఖ్యమంత్రే మాట మీద నిలబడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజాం ఫ్యాక్టరీలను పునరుద్దరించాలని కార్మికులు, రైతులు డిమాండ్
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజాం ఫ్యాక్టరీలను పునరుద్దరించాలని కార్మికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే పరిశ్రమలను నడిపిస్తే..అనేక కార్మిక కుటుంబాల బతుకులు బాగుపడతాయని చెబుతున్నారు. 

Don't Miss