పదవొకరిది..పెత్తనం మరొకరిది..

18:35 - January 9, 2017

నిజామాబాద్ : అధికారంలో ఉన్నాం కదా అని కొందరు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ మాట వినకుంటే అధికారులపై సైతం దాడులకు దిగుతున్నారు. అలాగే పదవి ఒకరిదైతే..పెత్తనం మరొకరు చెలాయిస్తున్నారు. నిజమాబాద్ కార్పొరేషన్‌లో కొందరు కార్పొరేటర్ల అధికార దుర్వినియోగంపై 10TV ప్రత్యక కథనం...

అధికారం అండతో ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం
నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల దూకుడు రోజురోజుకు పెరిగిపోతోంది. కొందరు మహిళా కార్పొరేటర్లకు బదులు వారి కుటుంబసభ్యులు పెత్తనం చెలాయించడం విమర్శలకు తావిస్తోంది. అభివృద్ధికి పాటు పడాల్సిన ప్రజాప్రతినిధులే అధికారులను అడ్డుకుని దాడులకు పాల్పడుతూ.. అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల హవా
జిల్లా కేంద్రంలోని డివిజన్‌లకు వెళ్లాలంటేనే కార్పొరేషన్‌ అధికారులు భయపడుతున్నారు. తమ అనుమతి లేనిదే డివిజన్‌కు రావొద్దంటూ కార్పొరేటర్లు హుకుంలు జారీ చేస్తున్న పరిస్థితి నిజామామాబాద్‌ కార్పొరేషన్‌లో ఉంది. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు గుర్తించిన అధికారులు సదరు భవనాలకు నోటీసులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న కొందరు కార్పొరేటర్లు.. అధికారులు, సిబ్బందిని అడ్డుకుని.. అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేశారు.

అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టకుండా.. అడ్డుకున్న కార్పొరేటర్లు..!
నగరంలో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా..అక్కడ సంబంధిత కార్పొరేటర్ల అనుచరులు వాలిపోతున్నారు. అన్ని సక్రమంగా ఉన్నా... నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఎంతో కొంత డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అక్రమ కట్టడాలను కూల్చి వేసేందుకు వెళ్లిన అధికారులపై అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ దాడికి దిగడం విమర్శలకు తావిస్తోంది.

నోటీసులు ఎందుకిచ్చారంటూ ఓ మహిళా కార్పొరేటర్‌ భర్త ఆగ్రహం
గతంలో నగరంలోని ద్వారకానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఓ భవన యజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ ఆ డివిజన్‌కు చెందిన మహిళా కార్పొరేటర్‌ భర్త అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే.. పదో డివిజన్‌లోని కెనాల్‌ కట్ట వద్ద ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారిపై 26వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ చేయి చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. అదేవిధంగా అనర్హులకు ఫెన్షన్‌ మంజూరు చేయాలంటూ అధికార పార్టీకి చెందిన మరో కార్పొరేటర్‌ అధికారులపై ఒత్తిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరపాలక సంస్థలో మేయర్‌తో సహా 26 మంది మహిళా కార్పొరేటర్లు
ఇక నగరంలో మహిళా కార్పొరేటర్ల పరిస్థితి మరోలా ఉంది. పేరుకే కార్పొరేటర్లు కానీ.. పెత్తనం అంతా వారి భర్తలదే. నగరపాలక సంస్థలో మేయర్‌తో సహా 26 మంది మహిళా కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తే.. ఇందులో చాలా మంది కార్యాలయాల్లో వారి భర్తలే దర్శనమిస్తున్నారు. మేయర్‌, కమిషనర్‌ సమక్షంలో సమావేశాలు జరిగినా.. మహిళా కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తలు లేక కొడుకులు హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ జోక్యం చేసుకుని అధికార పార్టీ కార్పొరేటర్లకు కల్లెం వేయాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. 

Don't Miss