బోటు ప్రమాద ఘటనకు బాధ్యులెవరు ?

08:47 - November 15, 2017

కృష్ణా : విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీలో పడవ ప్రమాద ఘటనలో  ప్రభుత్వ శాఖల తప్పిదాలే ఎక్కువగా  కనబడుతున్నాయి. జలవనరుల శాఖతోపాటు టూరిజం శాఖల సమన్వయం లోపం కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జలవిహారం 22 మంది జలసమాధికి అయ్యారు.
బోటు ప్రమాదంతో విషాదం 
కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాంతమైన విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పవిత్రంగా భావిస్తున్న ఈ ప్రాంతాన్ని రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ బోటు ప్రమాదంతో విషాదంగా మార్చింది. దీనిని భాదిత  కుటుంబాలతోపాటు ఇబ్రహీంపట్నంలోని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బోటు నిర్వాహకులకు ప్రభుత్వ పెద్దల అండదండలు 
కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో 22 ప్రాణాలు బలికావడానికి  సూత్రధారులైన వారిపై ఇంతవకు చర్యలు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వీరికి ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండదండలు ఉన్నాయని భావిస్తున్నారు.   ప్రమాదం అనుకోకుండా జరిగినప్పటికీ,  అనుమతిలేకుండా ప్రయాణికులను చేరవేస్తుంటే అధికారులు మిన్నకుండిపోవడం  చర్చనీయాంశంగా మారింది. బోటును నదిలోకి రానీయకుండా ఉంటే ప్రమాదం జరిగి ఉండేదికాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేట్ బోటు నదిలో విహరించడం,  దీని నిర్వాహకులు  కాసులకు కక్కుర్తి పర్యాటకుల ప్రాణాలతో చెలగాటానికి కారణమైంది. రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్   సంస్థపై  కంటితుడుపు చర్యలతో సరిపెట్టినా...  ప్రమాదానికి ఏ ప్రభుత్వ శాఖ  బాధ్యతవహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ప్రభుత్వంలోని పెద్దలు తమపై వేటు పడుతుందన్న ఉద్దేశంతో ప్రమాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుదోవ పట్టించారని వినిపిస్తోంది.  
అనుమతిలేని బోట్లతో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ?
రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ అనుమతి లేకుండా కృష్ణా నదిలో బోటు నడపడం చూస్తుంటే..  పెద్ద ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  ప్రమాదానికి కారణమైన బోటు అధికారులకు తెలియకుండానే తిరిగిందా .. అన్న సందేహాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అనుమతిలేని బోటుకు ఎందుకు నిలువరించలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  అధికారుల అవినీతితోనే కృష్ణానదిలో అనుమతి లేకుండా బోట్లు తిరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను  మంత్రివర్గం  నుంచి బర్తరఫ్ చేయాలని వైసీపీ, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు  డిమాండ్ చేస్తున్నారు.  అక్రమంగా తిరుగుతున్న బోట్లకు అడ్డుకట్టవేయడంలో విఫలమైన పర్యాటక, నీటిపారుదల శాఖ అధికారులను సస్పెండ్‌ చేయాలన్న డిమాండూ వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం   రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్ సంస్థ నిర్వాహకులను ప్రమాదానికి భాద్యుల్ని చేస్తూ, ప్రభుత్వ అధికారులను తప్పించేందుకు ప్రయత్నిస్తోందన్న  విమర్శలు వస్తున్నాయి.      
విషాదానికి బాధ్యులెవరన్న విషయం బాబుకు తెలియదా..?  
పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రభుత్వ అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ప్రజలల్లో చర్చ జరుగుతోంది. ఇంతటి ఘోర విషాదానికి బాధ్యులెవరన్న విషయం చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పడవ ప్రమాదానికి కారణమైన నిర్వాహకులపై ఐపీసీ 304 సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందడంటున్నారు.

 

Don't Miss