ప్రదీప్ ఎప్పుడొస్తాడు ?..పోలీసుల ఛార్జీషీట్ ?

12:15 - January 8, 2018

హైదరాబాద్ : యాంకర్ ప్రదీప్ అంశం ఇంకా ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన కారును సీజ్ చేసిన పోలీసులు తల్లిదండ్రులతో బేగంపేట ట్రాఫిక్ పీఎస్ లో జరిగే కౌన్సెలింగ్ కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. 31వ తేదీన ఘటన జరగగా జనవరి 8వ తేదీ వరకు కౌన్సెలింగ్ కు హాజరు కాలేదు. ప్రదీప్ ఎప్పుడు హాజరవుతారో తెలియదని..కానీ కౌన్సెలింగ్ కు మాత్రం హాజరు కావాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెబుతున్నారు. ఈ మధ్యలో ప్రదీప్ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. తాను ఎక్కడకు వెళ్లడం లేదని...షూటింగ్ లు పూర్తి చేయాల్సి ఉన్నందున కౌన్సెలింగ్ కు హాజరు కాలేకపోతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. చట్ట ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు.

ఈ వీడియో విడుదల చేసి మూడు రోజులవుతున్నా ప్రదీప్ ఇంకా కౌన్సెలింగ్ కు హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రోజు పట్టుబడిన ఇతరులు తమ తమ తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ కు హాజరవుతున్నారు. ప్రదీప్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రదీప్ రాకపోతే ఆయనపై ఛార్జీషీట్ నమోదు చేసి అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ప్రదీప్ హాజరవుతారా ? లేదా ? అనేది త్వరలో తెలియనుంది. 

Don't Miss