పౌర విమానాయాన శాఖ కొత్త నిబంధనలు

12:38 - May 6, 2017

ఢిల్లీ : విమాన ప్రయాణానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. విమానంలో గానీ...విమానాశ్రయంలో గానీ... సిబ్బందితో ఘర్షణకు దిగితే నేరం చేసినట్లుగా భావిస్తారు. మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు విమాన ప్రయాణంపై నిషేధం విధిస్తారు. 
దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తే భారీ మూల్యం
ఇకపై విమానాల్లో ప్రయాణించేటపుడు దురుసుగా, లేదా అసభ్యంగా ప్రవర్తించే వారు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పౌర విమానాయాన శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా.... విమానంలో గానీ, విమానాశ్రయంలో గానీ,  సిబ్బందితో ఘర్షణకు దిగినా ఆ వ్యక్తిని నేరం చేసినట్లుగా భావిస్తారు. అతని పేరును 'నో ఫ్లై లిస్టు'లో నమోదు చేస్తారు. ముందుగా ప్రజల నుంచి వీటిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని, తర్వాత జూన్ నుంచి వీటిని అమలుచేస్తామని పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రకటించారు.
వేర్వేరు నేరాలకు 3 నెలల నుంచి రెండేళ్ల వరకు నిషేధం   
ఇందులో వేర్వేరు నేరాలకు గాను 3 నెలల నుంచి రెండేళ్ల వరకు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించే అవకాశం ఉంది. లెవెల్ 1లో శారీరక చేష్టల ద్వారా అంతరాయం కలిగించేవారికి 3 నెలలు, లెవెల్ 2లో భౌతిక దాడులు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి 6 నెలలు, లెవెల్ 3లో ప్రాణాలకు ముప్పు తెచ్చే రీతిలో బెదిరింపులు,  విమాన ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను నష్టపరచేవారికి రెండేళ్లు విమానాల్లో ప్రయాణించే వీలుండదు. ఈ నిబంధనలు దేశీయ విమానయాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే తాము ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
విమానంలో ప్రయాణించకుండా గ్వైక్వాడ్‌పై నిషేధం 
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా విమానంలో ఓ ఉద్యోగిని కొట్టాడు. దీంతో ఎయిర్‌ ఇండియాతో పాటు ఇతర సంస్థలు విమానంలో ప్రయాణించకుండా గ్వైక్వాడ్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో  గందరగోళం చెలరేగడంతో కేంద్ర విమానాశాఖ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది.

 

Don't Miss