వానమ్మ నీ జాడదెమ్మ

08:05 - August 7, 2017

నిజామాబాద్ : జిల్లాలో రైతుల ఆశలు ఆవిరవుతుననాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో వరుణుడు మురిపించాడు. దీంతో అన్నదాతలు ఆశతో విత్తనాలు విత్తారు. తీరా పైరు ఎదిగే క్రమంలో వరుణుడు ముఖం చాటేశాడు. అన్నదాతల ఆశల మేఘాలు ఆవిరై కరువు మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఎటు చూసినా ఎండుతున్న పంటలు... వాటిని దిగాలుగా చూస్తున్న రైతులే కనిపిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ కలిపి 3,79,553 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా.... వర్షాలు కురవకపోవడంతో కేవలం 2,64,979 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. అంటే సుమారు 1,14,574 ఎకరాల్లో ఇప్పటికీ పంటలు వేయలేదు. ఇప్పటి వరకు సాగైన పంటల్లో వరి 40శాతం, మొక్కజొన్న 20శాతం, సోయా 10శాతం దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కాలేదు. జూన్ -జులై మాసాల్లో వర్షాల మీద ఆధారపడి పంటలు వేశారు.

జూల్లై లో వర్షభవం
జూన్‌లో ఓ మోస్తారు వర్షం కురిసినా... జులైలో మాత్రం అంతగా పడలేదు. జూన్‌లో 150 మిల్లీ మీటర్ల వర్షం పడితేనే పంటలకు సరిపోతుంది. కానీ 120 మిల్లీ మీటర్ల వర్షపాతం మించలేదు. మొత్తం 27 మండలాల్లో కేవలం 9 మండలాల్లోనే సగటు వర్షపాతం నమోదు అయ్యింది. 18 మండలాల్లో సగటు కంటే తక్కువగానే నమోదు అయ్యింది. దీంతో పంటలపై వర్షభావ పరిస్థితి ప్రభావం చూపుతోంది. శ్రీరాంసాగర్‌, రామడుగు ప్రాజెక్టులతోపాటు కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతులు పంటలను వేశారు. కానీ తీవ్ర వర్షభావం కారణంగా చుక్క వరదనీరు వచ్చి చేరలేదు. దీంతో ఆయకట్టు కింద పంటలు సాగు చేసుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాబోయే రోజుల్లోనైనా వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరైన సింగూరు జలాలను వదిలి ఆయకట్టు రైతులను నిజామాబాద్‌ రైతులను ఆదుకోవాలని రైతులు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.

అడుగంటిన భూగర్భజలాలు
ప్రాజెక్టులు నిండకపోవడం, వర్షాలు కురవకపోవడం కారణంగా జిల్లాలో భూగర్భజలాలు కూడా తగ్గిపోయాయి. బోర్ల నుంచి వచ్చే నీరుకూడా బాగా తగ్గిపోయింది. దీంతో బోర్లకింద సాగుచేసిన పంటలకూ నీళ్లు అందడం లేదు. దీంతో పంట భూములన్నీ బీటలు వారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. అప్పుసప్పు చేసి వేసిన పంట కళ్లముందే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రాకపోతే అప్పులు ఎలా తీర్చాలని దిగాలు చెందుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Don't Miss