వివాదాస్పదంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం

13:43 - January 12, 2017

తూర్పుగోదావరి : పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ప్రాజెక్ట్...ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. పోలవరం కుడి కాలువ ద్వారా 2లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని అధికారపార్టీ చెబుతుంటే...లిఫ్ట్‌ స్కీమ్‌తో అవినీతి సాగుతోందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు భూములు కోల్పోతున్న రైతులు సైతం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీంతో పురుషోత్తపట్నం వివాదం ఆసక్తిగా మారింది. 
సర్కార్ పై విపక్షాలు మండిపాటు 
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారుతోంది. ఓవైపు పోలవరానికి కాంక్రీటు పండుగలు చేసి..మరోవైపు లిఫ్ట్‌ స్కీమ్‌లు దండగగా నిర్మిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ లిఫ్ట్‌ పథకంతో చంద్రబాబు అవినీతికి ఆజ్యం పోస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంటే...పురుషోత్తపట్నం వల్ల ప్రయోజనం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడుతున్నారు. 
భూసేకరణపై రైతులు ఆగ్రహం 
అటు భూసేకరణపై రైతులు కూడా మండిపడుతున్నారు.. భూములకు ఇచ్చే ధరకూడా చాలా తక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. టీడీపీ స్వార్థ ప్రయోజనాలకోసమే ఇలాంటి పనులు చేస్తోందని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
విమర్శలను పట్టించుకోని ప్రభుత్వం 
అయితే ఈ విమర్శలను ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఎత్తిపోతల ద్వారా  జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగునీరు అందనుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తవ్వి వదిలేసిన కాలువల్లో రైతుల కన్నీరు పారుతోందని అన్నారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తెలిపారు. 
భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభం 
మరోవైపు పురుషోత్తపట్నం లిఫ్ట్‌ నిర్మాణం కోసం భూసేకరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో తమకు పట్టిసీమ తరహా ప్యాకేజీ చెల్లిస్తేనే భూములిస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు సర్వేబృందాలను అడ్డుకున్న నిర్వాసితులు...2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Don't Miss