నోబెల్ వరించిన శాంతి దూతలు..

17:29 - October 5, 2018

కాంగో : నోబెల్ బహుమతి వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపుగా..వారిని గౌవరివిస్తు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి. నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2018లో ఇద్దరికి లభించింది. కాంగోకు చెందిన గైనకాలజిస్ట్ డెనిస్ ముక్‌వెగె, 2014లో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదుల చేతిలో గ్యాంగ్ రేప్ కు గురైన యాజిదీ తెగ యువతి నదియా మురాద్ లను సంయుక్తంగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. యుద్ధ రంగంలో లైంగికదాడిని ఓ ఆయుధంగా వాడటంపై వీరు చేసిన పోరాటానికి గానూ నోబెల్ అకాడమీ వీరిని శాంతి బహుమతితో గౌరవించింది.
ఈ అవార్డు కింద అందనున్న 7.35 కోట్లను  ఇద్దరు విజేతలు సమంగా పంచుకోనున్నారు. ప్రపంచంలో అత్యాచారాలు, ఘర్షణలు అధ్యధికంగా చెలరేగే దేశంగా కాంగోకు పేరుంది. అక్కడ రోజుకు కొన్ని వందల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతాయి. వేర్వేరు తెగలు, నాయకుల మధ్య జరిగే అంతర్గత సాయుధ ఘర్షణల్లో సాధారణ మహిళలపై సైనికుల అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. 
1990 దశకంలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అప్పటి నుంచి ముక్‌వెగె వీటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. బాధితులకు చికిత్స అందించడంతో పాటు చదువు నేర్పించి, తమ కాళ్లపై తాము నిలబడేట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నిందితులకు శిక్ష పడేందుకు పోరాడుతున్నారు. ఇక నదియా మురాద్ అనే 25 మహిళ ఇరాక్ లో ఉండగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 2014లో ఆమె ఊరిపై దాడిచేశారు. అదే గ్రామానికి చెందిన వందలాది మంది యాజిదీ జాతి పురుషులను, వృద్ధ మహిళలను కాల్చిచంపారు.
అనంతరం నదియా సహా వందలాది మంది యాజిదీ జాతి మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కొన్ని రోజుల అనంతరం నదియాను అమ్మేశారు. చివరికి ఆమె ఎలాగోలా ఐఎస్ఐఎస్ చెర నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. తన కుటుంబ సభ్యులతో పాటు మిగతా గ్రామస్తులను చంపిన ఉగ్రవాదులకు శిక్ష పడేందుకు పోరాడుతోంది. ఉగ్ర చర్యల కారణంగా మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన యువతులు, మహిళలకు నదియా అండగా నిలబడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ 2018 సంవత్సరానికి అకాడమీ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.

Don't Miss