నగరవాసులను ఆకట్టుకుంటున్న నుమాయిష్‌

16:47 - January 12, 2017

హైదరాబాద్: నుమాయిష్‌.. ఈ పేరు వినగానే హైదరాబాదీలకే కాదు.. తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది.. అంతులేని ఉత్సాహం.. అంతేస్థాయిలో సమకూరే విజ్ఞానం. అవును విజ్ఞాన వినోదాల మేళవింపుగా సాగే అపురూప పర్వమే నుమాయిష్‌. ఏటా 46 రోజుల పాటు ప్రజలను అలరించే నుమాయిష్‌.. ఈ ఏడాదీ మరిన్ని విశిష్టతలను సంతరించుకుంది.. ప్రజలను తనదైన శైలితో అలరిస్తోంది.

అంగరంగ వైభవంగా ...

హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే నుమాయిష్‌ ఈసారీ అంగరంగ వైభవంగా సాగుతోంది. నుమాయిష్‌గా కన్నా.. నాంపల్లి ఎగ్జిబిషన్‌గా చిరపరిచితమైన ప్రదర్శన ఆహూతులను అమితంగా ఆకట్టుకునేందుకు సర్వసన్నద్ధమైంది. హైదరాబాద్‌ వాసులనే కాదు.. ఇతర ప్రాంతాల వారినీ నుమాయిష్‌ ఆకర్షిస్తోంది. విజ్ఞాన, వినోదాలను పంచుతోంది.

గడచిన 76 సంవత్సరాలుగా ...

గడచిన 76 సంవత్సరాలుగా నుమాయిష్‌ ప్రజలను అలరిస్తూ వస్తోంది. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1938వ సంవత్సరంలో నుమాయిష్‌కు శ్రీకారం చుట్టారు. స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఉస్మానియా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ల బృందం సహకారంతో... వంద స్టాల్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్‌ ప్రారంభమైంది. అయితే ఇవాళ, దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులను ప్రదర్శించే స్థాయికి నుమాయిష్‌ చేరింది. ప్రస్తుతం ఉత్పత్తుల ప్రదర్శనకు దాదాపు 2500 స్టాల్స్‌ ఏర్పాటు చేశారిక్కడ. నుమాయిష్‌ చిన్నా పెద్దా అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. తొలినాళ్లలో వేలల్లో ఉన్న సందర్శకుల సంఖ్య ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. నిరుడు దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శించారంటే దీనికున్న ఆదరణ ఏంటో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.

మినీ ఇండియాని తలపిస్తోన్న నుమాయిష్

నుమాయిష్‌.. మినీ ఇండియాను తలపిస్తోంది. ఇక్కడి స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్న ఉత్పత్తులు.. పొరుగు ప్రాంతాల సంస్కృతీసంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల పనితనం.. నుమాయిష్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కాశ్మీరీల హస్తకళలు, రాజస్థానీ హాండ్ వర్క్స్, ఉత్తర్ ప్రదేశ్ అత్తరు వంటివి ఎగ్జిబిషన్‌ లో ప్రతీసారి హైలైట్ గా నిలుస్తాయి.

ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌, బట్టలూ , బొమ్మలూ, పింగాణీ వస్తువుల , ప్లాస్టిక్ సామాను, ఫర్నిచర్, లాడ్ బజారుని మరిపించే గాజులు ఇలా ప్రతిఒక్కటి ఇక్కడ స్పెషల్ అనే చెప్పుకోవాలంటున్నారు సందర్శకులు. బ్యాగుల దగ్గర్నుంచి బైకుల వరకు. రకరకాల మెటీరియల్స్. ఎన్నడూ చూడనివి.. ఎప్పుడూ వాడనివి.. మనసుకు నచ్చేలా పర్సుకు తగిన విధంగా ఉంటాయంటున్నారు వీరు. కొనకపోయినా ఫరవాలేదు. కొత్త డిజైన్లు చూడ్డానికైనా వెళ్లాలన్నది సందర్శకుల మాట. ఇవన్నీ ఒక ఎత్తయితే చిల్డ్రన్ జోన్ మరీ ప్రత్యేకం... పిల్లలకోసం బోలెడన్ని రైడ్స్. టోరటోర, రంగుల రాట్నం, హెలికాప్టర్, రోలింగ్ కప్ సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిజ్బీ, రేంజర్‌లతో పాటు మోటారు బైకులపై విన్యాసాలు, సర్కస్ ఫీట్లు- ఇలా చూసినా కొద్దీ చూడలనిపించేవి... ఆడుకోవాలనిపించేవి బోలెడన్ని ఉన్నాయిక్కడ.. వీటికి తోడు ఎగ్జిబిషన్ అంతా కలియ చుట్టొచ్చేందుకు రైలు కూడా అందుబాటులో వుంటుంది.. దీంట్లో పెద్దా చిన్నా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఉర్రూతలూగిస్తున్న గోమ్స్ జోన్....

నుమాయిష్‌కు తరలివచ్చే పెద్దలను ఇక్కడి వస్తువులు, ఉత్పత్తులు అలరిస్తుంటే.. పిల్లలను మాత్రం గేమ్స్‌ జోన్‌ ఉర్రూతలూగిస్తోంది. ఈ జోన్‌లోకి అడుగుపెట్టిన పిల్లలు పెట్టే కేరింతలతో ఆ ప్రాంగణం హోరెత్తిపోతోంది. నుమాయిష్‌కు తరలివచ్చే పెద్దలను ఇక్కడి వస్తువులు, ఉత్పత్తులు అలరిస్తుంటే.. పిల్లలను మాత్రం గేమ్స్‌ జోన్‌ ఉర్రూతలూగిస్తోంది. ఈ జోన్‌లోకి అడుగుపెట్టిన పిల్లలు పెట్టే కేరింతలతో ఆ ప్రాంగణం హోరెత్తిపోతోంది.

ఫ్రీ పార్కింగ్‌ యాప్‌...

నుమాయిష్‌కు భారీగా సందర్శకులు తరలివస్తారన్న ఉద్దేశంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 46 రోజుల పాటు జరిగే సంరంభంలో.. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సొసైటీ అన్ని విధాలైన చర్యలూ తీసుకుంది. వాహనాలు నిలిపేందుకు ఇబ్బందిలేకుండా నాంపల్లి పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్‌బోర్డుకు చెందిన గగన్‌విహార్‌, చంద్రవిహార్‌, గృహకల్ప, మనోరంజన్‌ కాంప్లెక్స్‌తోపాటూ నల్లకుంట ప్రధాన రహదారిలో ఫ్రీపార్కింగ్‌ ఏర్పాటు చేశారు. నుమాయిష్‌ను సందర్శించడానికి వచ్చే లక్షలాదిమంది తమ వాహనాలను ఎక్కడెక్కడ పార్కింగ్‌ చేసుకోవాలనే వివరాలను తెలుసుకోవడానికి ఫ్రీ పార్కింగ్‌ యాప్‌ను ప్రారంభించారు.

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను భద్రతావలయంగా ...

ఇక సందర్శకుల రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను భద్రతావలయంగా తీర్చిదిద్దారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, అంతర్గత భద్రత కోసం సెక్యూరిటీ గార్డులు, వలంటీర్లు, వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది, మెటల్ డిటెక్టర్‌లు, హ్యాండ్ డిటెక్టర్‌లతో తనిఖీలు చేపడుతున్నారు. సందర్శకులకోసం మొబైల్‌టాయ్‌లెట్లు, మంచినీరు, వృద్ధులకు ప్రవేశమార్గాల వద్ద ప్రత్యేకంగా వీల్‌చైర్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు.. సొసైటీ నిర్వహణలోని పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. సందర్శకులకు వినోదాన్ని పంచుతున్నారు.

పెద్ద నోట్ల రద్దు ప్రభావం...

నుమాయిష్‌ మొదలైందంటే నగర వాసులు నయా జోష్ తో ఉంటారు.. కాని ఈ సారి నాంపల్లి ఎగ్జిబిషన్ కి జోష్ తక్కువైందనే చెప్పుకోవాలి. దాదాపుగా 2వేల 500 స్టాల్స్ ఎప్పుడు సందర్శకులతో కళకళలాడుతుండేవి. కాని ఆరంభంలోనే ఆ కళ తప్పినట్టుగా కనిపిస్తోంది. దీనికంతటికి పెద్ద నోట్ల రద్దు కారణమంటున్నారు షాప్ యజమానులు. ఇప్పటికే ఒక్కో స్టాల్‌ లో రోజుకు వేలాది రూపాయల గిరాకి ఉండేదని కాని అసలు కస్టమర్లు లేక ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నుమాయిష్‌ ఎగ్జిబిషన్ లో దొరకని వస్తువంటూ ఉండదు... ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటు లో ఉంటుంది.. మిగితా ఎగ్జిబిషన్ల తో పోలిస్తే ధర కూడా సామాన్యులకి అందుబాటులో ఉంటుంది. అలాంటి ఎగ్జిబిషన్ లో జనాలు లేక స్టాల్స్ అన్నీ వెలవెలబోతున్నాయి. ఎవరిని కదిలించినా నోట్ల రద్దు తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. రెండువేల నోటు తీసుకొస్తే చిల్లర లేదని పంపుతున్నారని కస్టమర్లు చెబుతున్నారు. చాలా వరకు స్టాల్స్ యజమానులు స్వైప్‌ మిషన్లు ఏర్పాటు చేసుకున్నారు. అయినా కూడా కస్టమర్లు రాకపోవడంతో ఈసారి తమ గిరాకి దెబ్బతినేలా వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశ నలుమూలల నుంచి తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి లక్షలాది రూపాయలు పెట్టి సరుకు తీసుకొస్తే ఇక్కడ కొనేవాళ్లు లేక దిగాలుగా కూర్చున్నారు స్టాల్స్ ఓనర్లు. రాజస్థాన్ , గుజరాత్, కాశ్మీర్ , బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి బట్టలు అమ్ముకునేందుకు ఇక్కడికి వచ్చి తాము నష్టాలతో ఇంటికి చేరుకునే పరిస్థితులు వచ్చేలా వున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వస్తువులకు కొన్ని ప్రాంతాలే ఫేమస్. అలాంటి ప్రముఖమైన వస్తువులన్నీ ఒకే చోట కలబోసినట్టు ఉండేది కేవలం నుమాయిష్ లో మాత్రమే.. అలాంటి నుమాయిష్‌కు పెద్ద నోట్ల రద్దు పెద్ద షాక్ నే ఇచ్చిందంటున్నారు నిర్వాహకులు.

Don't Miss