'రాహుల్' సభకు 'నో'..వెనుక...

21:26 - August 10, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సభపై రగడ జరుగుతోంది. ఈనెల 14న తలపెట్టిన రాహుల్‌ సభకు ఓయూ అధికారులు అనుమతి నిరాకరించడంపై విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్టు అధికారులు చెబుతున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒత్తిడికి లొంగిన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు.. రాహుల్‌ సభను అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సభసై రాజకీయ దుమారం చెలరేగుతోంది. యూనివర్సిటీలోని ఠాకూర్‌ ఆడిటోరియంలో రాహుల్‌ విధ్యార్థులతో భేటీ కోసం కాంగ్రెస్‌ నాయకులు అనుమతి కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు లేఖ రాశారు. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించడంతో కాంగ్రెస్‌ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

రాహుల్‌ సభకు అనుకూలంగా, వ్యతిరేకగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు విడిపోయాయి. అడ్డుకుంటామని ఒక వర్గం, సభ నిర్వహించి తీరతామని మరోవర్గం ప్రకటించడంతో వివాదం ముదిరింది. రాహుల్‌ రాకను టీఆర్‌ఎస్వీ వ్యతిరేకిస్తోంది. రాహుల్‌ ఫ్రొపెసర్‌ లేదా శాస్త్రవేత్త కాదన్నది టీఆర్‌ఎస్వీ వాదన. రాజకీయ నాయకులు యూనివర్సిటీకి వస్తే విద్యా వాతావరణం పాడైపోతుందని టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు అంటున్నారు. తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్‌ జాప్యం చేయడంతోనే వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేయడాన్ని టీఆర్ఎస్వీ నాయకులు తప్పుపడుతున్నారు. దీనివలన తెలంగాణ నుంచి ఏపీకి పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు రాహుల్‌ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.

మరోవైపు ఓయూ నిధుల కొరత ఎదుర్కొంటోందని... ఎస్సీ, ఎస్టీ విద్యార్థులుకు ఉపకారవేతనాలు రావడంలేదన్న వాదాన్ని రాహుల్‌ అనుకూలవర్గం విద్యార్థి సంఘాలు వినిపిస్తున్నాయి. దళితులపై దాడులు, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణలో తాండవిస్తున్న నిరుద్యోగ సమస్య వంటి అంశాలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. రాహుల్‌ ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని..ఆయన పర్యటనను రాజకీయం చేయడం తగదని అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడి సభకు అనుమతి ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్‌ కృష్ణారావు కార్యాయంలో విద్యార్థి నాయకులు బైఠాయించారు. సదస్సుకు అనుమతి కోరుతూ రూ.25 వేల డీడీ చెల్లించి... ఈనెల 4న దరఖాస్తు చేసుకున్నా...పర్మిషన్‌ ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రాహుల్‌ పర్యటనపై విద్యార్థి సంఘాలు రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఆయన వస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తవచ్చన్న అనుమానంతో ఏఐసీసీ అధ్యక్షుడి సభకు అనుమతి నిరాకరించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది.

రాహుల్‌ ఓయూ సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈనెల 14న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే రాహుల్‌ సభ ఏర్పాట్లను తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు.నిరుద్యోగ గర్జన పేరుతో నిర్వహించే ఈ సభకు భారీగా విద్యార్థులను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రోజుల రాహుల్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Don't Miss