రైతులను మోసం చేసిన అధికారులు

16:47 - September 3, 2017

కరీంనగర్/సిరిసిల్ల : అవినీతి అధికారుల అత్యాశ సిరిసిల్లలోని వీర్నాపల్లి రైతులకు తీరని బాధను మిగిల్చింది. వీర్నాపల్లి మండల కేంద్రాన్ని ప్రధాన మంత్రి సంసద్‌ ఆదర్శ్‌ యోజన పథకం కింద కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో వెనుకబడిన తరగతుల వారికి జీనోపాధిని కల్పించాలనే సదుద్దేశ్యంతో ఎంపీ జనరల్‌ ఫండ్‌ నుండి సబ్సీడీ ద్వారా ఆవులను కొనివ్వాలని నిర్ణయించారు. అందుకోసం గ్రామంలో 18 మంది లబ్దిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రెండు పాడి పశువుల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించి బ్యాంక్‌ ద్వారా 80 వేల రుణం ఇప్పించారు. అందులో 50 శాతం సబ్సీడీ పోగా మిగిలిన 50 శాతం అంటే 40 వేలు రైతులు కట్టాల్సి ఉంటుంది.

40 వేల చొప్పున రైతులకు
వెనుకబడిన వారిని ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. అయితే దీనికి విరుద్ధంగా అవినీతి అధికారులు ప్రవర్తించడంతో ఆ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. స్థానికంగా, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల నుండి మేలు జాతి ఆవులను తీసుకురావాల్సిన అధికారులు....ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం మీదుగా రైతులను కోనసీమకు తీసుకువెళ్లారు. అక్కడ ఒక్కో పశువు విలువ సుమారు 15 నుండి 20 వేల మధ్య ఉంటే అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఒక్కో పశువును 40 వేల చొప్పున రైతులకు అంటగట్టారు.

తెచ్చిన పశువులు మూడు రోజులకే చనిపోయాయి
అంతేకాదు కొనుగోలు చేసిన పశువులను తమ ఖర్చులతోనే తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. ఇలా తెచ్చిన పశువులు ఓ రైతు దగ్గర మూడు రోజులకే చనిపోయాయి. నష్టపరిహారం కోసం వెళ్తే ఇన్సూరెన్స్‌ లేదంటూ అధికారులు ఆ రైతును గెంటేశారు. గ్రామంలోని మరో ఇద్దరి లబ్దిదారుల పశువులు కూడా చనిపోతే వారికి కూడా అధికారులు మొండిచేయి చూపించారు. మరోపక్క బ్యాంకులో కట్టాల్సిన డబ్బు కోసం అధికారులు వేధించడంతో పోషణ కోసం పెంచుకున్న పశువులను అమ్ముకున్నాడు ఆ రైతు. 40 వేలు పెట్టి కొన్న పశువు 20 వేలకే అమ్ముడుపోవడంతో రైతు అప్పులపాలయ్యాడు. తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారుల దగ్గర మొరపెట్టుకున్నా.. న్యాయం జరగలేదు. దీంతో మోసపోయిన రైతు ఉన్నదాంట్లో బతుకుతున్న తమను అనవసరంగా ఆశ చూపి దిక్కులేని వాళ్లని చేశారని వాపోతున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. 

Don't Miss