'పాలమూరు.. రంగారెడ్డి'పై మాటల యుద్ధం

11:58 - September 3, 2017


మహబూబ్ నగర్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికారపార్టీ.. ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.. ఈ పథకం ద్వారా డిండికి నీటి తరలింపుతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని  ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మా నీళ్లు మా నియమకాలు మాకే దక్కాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేతల మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు.. 

వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.. 2015 జూన్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ భూత్పూర్ మండలం కరివెన దగ్గర ఈ పథకం పైలాన్ ఆవిష్కరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాకు  మరో 30వేల ఎకరాలకు సాగునీరు అం దించేలా ఈ పథకాన్ని రూపుదిద్దారు. మూడేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేసి పాలమూరు కరువును  కేసీఆర్‌ ఆర్భాటంగా ప్రకటించారు. 

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళనబాట పట్టాయి. గత కొన్ని నెలల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ధర్నాలు, రాస్తోరోకోలతో ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నాయి.  డిండికి నీటిని తరలింపును విపక్షనేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
బైట్ః డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే

పాలమూరు జిల్లాకి సాగునీరు ఇవ్వకుండా డిండికి తీసుకుపోతే ఉద్యమం తప్పదని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇక్కడి ప్రాంతానికి రావాల్సిన నీటి వాట ఇచ్చిన  తర్వాత మిగిలిన ప్రాంతాల వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు  ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్దిలేదని...అందుకే మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను  అధికారపార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పాలమూరు జిల్లాకి అన్యాయం జరిగేలా ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టాడంలేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు రావాల్సిన 70టీఎంసీల నీరు కచ్చితంగా వస్తుందని... మిగిలిన నీటినే డిండీకి ఇస్తున్నామని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. 

మొత్తానికి పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ర‌గ‌డ ఇంక ర‌గులుతూనే ఉంది .పాల‌మూరుకి అన్యాయం జ‌రుగుతుంద‌ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తోంటే.... జిల్లాకు రావాల్సిన నీటి వాట‌ను ఖ‌చ్చితంగా తీసుకువ‌స్తామ‌ని  అధికారపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మ‌రి పాల‌మూరు రైతన్నకు ఈ ప్రాజెక్టు నుండి నీరు ఎప్పటికి అందుతుందో వేచి చూడాలి.

Don't Miss