పస లేని గవర్నర్ ప్రసంగం?!..

21:34 - March 12, 2018

హైదరాబాద్ : బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తుందని.. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు గవర్నర్‌ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్టగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం
తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విపక్షాల ఆందోళన మధ్యే గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్లు గవర్నర్‌ చెప్పారు.

ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత : గవర్నర్
అలాగే తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్‌ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యుదుత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించిందని.. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలను ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగాన్ని తప్పు పట్టిన విపక్షాలు
మరోవైపు గవర్నర్‌ ప్రసంగాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ప్రసంగం మొత్తం అబద్దాలే ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తుల విషయంలోనూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారని రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు.గవర్నర్‌ ప్రసంగం మొత్తం సత్యదూరంగా ఉందంటూ ప్రసంగం మధ్యలోనే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలోని ఏ అంశాన్నీ గవర్నర్‌ ప్రసంగంలో పెట్టలేదని టీడీపీ ఆరోపించింది. చివరిబడ్జెట్‌లోనైనా న్యాయం చేస్తారనుకుంటే అదీ లేదని ఆపార్టీ ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య మండిపడ్డారు.

రైతులను విస్మరించారు : సున్నం రాజయ్య
రైతు రుణమాఫీ, కౌలు రైతులకు ఎరువుల సాయం అంశాలను గవర్నర్‌ ప్రసంగంలో విస్మరించారని సీపీఎం ఆరోపించింది. మిషన్‌ భగీరథ 90 శాతం పూర్తయిందనడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఖండించారు. స్కీమ్‌ వర్కర్లు, కాంట్రాక్ట్‌ వర్కర్లు, నిరుద్యోగుల అంశాన్ని గవర్నర్‌ ప్రస్తావించలేదన్నారు.

Don't Miss