హైదరాబాద్‌ డీసీసీ ఎవరికి...?

12:00 - January 11, 2017

హైదరాబాద్‌ : నగర కాంగ్రెస్‌ కమిటీ పదవిని సొంతం చేసుకోవడానికి నేతలు తహతహలాడుతున్నారు. ఎలాగైనా డీసీసీ పదవిని దక్కించుకోవడానికి యువనేతలు పోటీపడుతున్నారు. కొందరు పీసీసీ చీఫ్‌ను ప్రసన్నం చేసుకుంటుంటే.. మరికొందరు ఢిల్లీ లెవల్లో చక్రం తిప్పుతున్నారు.   
హైదరాబాద్‌ డీసీసీ కమిటీపై పీసీసీ కసరత్తు
హైదరాబాద్‌ డీసీసీ కమిటీపై పీసీసీ కసరత్తు చేస్తోంది. దీంతో పార్టీలోని యువనేతల చూపు డీసీసీ పదవిపై పడింది. హైదరాబాద్‌ డీసీసీని యువతకు కట్టపెట్టాలని పీసీసీ భావిస్తుండడంతో..ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ రేస్‌లో మాజీ మంత్రులు ముఖేష్‌గౌడ్‌, మర్రి శశిధర్‌రెడ్డిల వారసులు... మాజీ మేయర్‌ బండకార్తీకరెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నట్టు సమాచారం.  
డీసీసీ పదవిని కోరుతున్న విక్రమ్‌గౌడ్‌, ఆదిత్యారెడ్డి
డీసీసీ కోసం ఎవరికీ వారు.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ తనయుడు..విక్రమ్‌ గౌడ్‌ డీసీసీ పదవి తనకే ఇవ్వాలని కోరుతున్నారట...దీని కోసం ఇప్పటికే ముఖేష్‌ గౌడ్‌ పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అలాగే మాజీ ముఖ్యమంత్రి  చెన్నారెడ్డి మనవడు.. మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి కూడా హైదరాబాద్‌ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం శశిధర్‌రెడ్డి ఇప్పటికే తన హస్తిన పరిచయాలను వాడుకుంటున్నట్టు సమాచారం.
డీసీసీ పదవిపై బండ కార్తీకరెడ్డి దృష్టి
డీసీసీ కోసం మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. హైకమాండ్‌కు తన కోరికను విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గాంధీభవన్‌పై కూడా ఒత్తిడి తెస్తున్నారు. కాగా నగరంలో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు డీసీసీ పదవిని దక్కించుకోవడానికి సీనియర్లు అంజన్‌కుమార్‌ యాదవ్‌, దానం నాగేందర్‌ సైతం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ డీసీసీ పదవికోసం సీనియర్లు.. జూనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ కుర్చీ ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

Don't Miss