మోడీ ప్రభుత్వం తలకిందుల చర్య : బృందకారత్

07:39 - May 20, 2017

హైదరాబాద్ : ఎన్నికల సంస్కరణలపై మోదీ సర్కార్‌ తలకిందుల చర్యలకు పాల్పడుతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. ఎన్నికల విరాళాలపై రూపొందించిన సంస్కరణలు రాజకీయ అవినీతిని మరింత ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లో ఎన్నికలు బంధీ అయిపోయాయని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలకు రాజకీయంగా ఇది ఓ పెద్దసవాల్‌ వంటిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమనేత సుందరయ్య వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్యం - ఎన్నికల సంస్కరణలు అన్న అంశంపై నిర్వహించిన సభలో ఆమె స్మారకోపన్యానం చేశారు. దేశంలో నేడు ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందువల్ల ఈవీఎమ్‌ల పనితీరుపై ప్రజల్లో విశ్వసనీయ పెంచేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి ఓటరు ఓటు వేసిన తర్వాత వారు ఏగుర్తుకు ఓటేశారో తెలిపేలా స్లిప్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Don't Miss