వారబంధీ..ఎండిపోతున్న పంటలు..

13:27 - August 29, 2017

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ప్రస్తుతం సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. దుక్కులు దున్ని వరినార్లు వేసిన తర్వాత నీటిని ఆపివేయడంతో ఆగ్రహం చెందుతున్నారు. నారాయణపూర్‌ నుంచి నీటిని విడుదల చేసి తమ పంటలను రక్షించాలని కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం పడిపోతోంది. ఎగువనున్న కర్నాటకలోని ప్రాజెక్టుల నుంచి నీరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో అధికారులు సోమవారం నుంచి వారబంధీని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు.

జూరాల ప్రాజెక్టు కింద లక్షా రెండువేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి రైతులంతా జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడే సాగు చేసుకుంటారు. ఖరీఫ్‌ సీజన్‌లోనూ రైతులంతా దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకున్నారు. వరినాట్లు వేస్తున్నారు. ఇవి ఇంకా పూర్తికూడా కాలేదు. అంతలోనే అధికారులు వారబంధీని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో గరిష్ట నీటినిల్వ 9.66 టీఎంసీలు, ప్రస్తుతం 6.19 టీఎంసీల నీరు జలాశయంలో అందుబాటులో ఉంది. ఇందులో 2.450 టీఎంసీల నీరు మాత్రమే సాగు అవసరాలకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దుక్కులు దున్ని వరినారు సిద్ధం చేసిన తర్వాత అధికారులు నీరు విడుదల ఆపేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటక ప్రాంతంలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నిల్వ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకున్నా... అక్కడి అధికారులు మాత్రం ఆయకట్టుకు వారబంధీ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా కిందికి నీటిని విడుదల చేయకుండా ఆ నీటితో అక్కడి చెరువులు, కుంటలు నింపుకుంటున్నారు. దిగువనున్న జూరాలకు మాత్రం చుక్కనీరు వదలడం లేదు. దీంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జూరాలకు కర్నాటక ప్రభుత్వం నీరు విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ రైతు సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కర్నాటక నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటిని విడుదల చేసేలా కేసీఆర్ ప్రయత్నాలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

Don't Miss