కేసీఆర్ పై పాలమూరు టీఆర్‌ఎస్‌ నేతలు అసంతృప్తి

18:31 - August 19, 2017

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. టీఆర్‌స్‌ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. గులాబి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక తమకు అన్నీ మంచి రోజులేనని.. పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు అనుకున్నారు. కానీ ఇప్పటికీ తమ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని.. పార్టీ అధినేత పని చేయించుకున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఇప్పుడు వాపోతున్నారు. 
అసంతృప్తితో టీఆర్ఎస్‌ నేతలు 
గులాబి అధినేత కేసీఆర్‌పై మహబూబ్‌నగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు ఇప్పటికీ ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌ సర్కార్‌ ఏర్పడితే తమకు రోజులు కలిసి వస్తాయనుకున్నవారికి ఈ రోజుకీ ఎలాంటి పదవులు రాలేదు. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు తాము పనికి వచ్చామని.. ఇప్పుడు అధికార పార్టీ కాగానే పక్క పార్టీలో నుంచి వచ్చిన నాయకులే కనిపిస్తున్నారని లోలోపల మధనపడిపోతున్నారు. 
పెరిగిన గ్రూపు రాజకీయాలు 
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు.. రానున్న ఎన్నికల్లో సీటు వస్తుందని ఆశించినవారు ఇప్పుడు తలలు పట్టుకొని కూర్చున్నారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పి పక్క పార్టీల నాయకులను తీసుకువచ్చి తమ పార్టీలో చేర్చుకున్నా.. ఇప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేలా లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 10 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముగ్గురు చొప్పున ఎమ్మెల్యే సీటును కోరుకుంటున్నారు. దీంతో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. 
రాజేందర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ 
మక్తల్, నారాయణ్‌ పేట, కల్వకుర్తి, గద్వాల్‌లో.. గులాబి పార్టీలో గ్రూప్‌ పాలిటిక్స్‌ ఎక్కువగా పెరిగాయి. గతంలో శివకుమార్ నారాయణ్‌ పేట్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్‌ రెడ్డి పార్టీ ఫిరాయించి గులాబీ కండువా కప్పుకున్నాడు. దీంతో శివకుమార్‌ వర్గం ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉంది. అలాగే ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యాడు.  
కల్వకుర్తిలో మరీ ఎక్కువైన గ్రూప్‌ రాజకీయాలు  
ఇక కల్వకుర్తిలో గ్రూప్‌ రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయి. ఎన్నికల ముందు టీడీపీ నుంచి బాలాజీ సింగ్‌ నాయక్‌ టీఆర్‌ఎస్‌లోకి వచ్చి అసెంబ్లీ ఇంచార్జ్‌గా పని చేశాడు. ఎన్నికల తరువాత అదే టీడీపీ నుంచి జైపాల్ యాదవ్‌ గులాబీ గూటికి చేరాడు. మరోవైపు ఇప్పుడు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ వచ్చే ఎన్నికల్లో తనదే అంటున్నాడు. దీంతో కల్వకుర్తిలో బాలాజీ సింగ్, జైపాల్ యాదవ్‌లు తీవ్ర అసహనంతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో ఎంత పని చేసినా ఉద్యమకారులకి గుర్తింపు రావడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు వాపోతున్నారు. మరి పాలమూరులోని గులాబీ నేతలను ముఖ్యమంత్రి ఎలా సమన్వయ పరుస్తాడో చూడాలి. 

 

Don't Miss