పేపర్ లెస్ ఆఫీసెస్..

18:51 - January 9, 2017

విజయవాడ : పరిపాలనలో పూర్తి పాదర్శకత కోసం ఏపీలోని అన్ని ఆఫీసులను పేపర్‌లెస్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఫైళ్ల పర్యవేక్షణతోపాటు, ఈ-కేబినెట్‌ విధానాలను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... కాగిత రహిత కార్యాలయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ-గవర్నెన్స్‌పై విశాఖలో జరుగుతున్న జాతీయ సదస్సులో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.

రెండు రోజుల సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌
ఏపీలో టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో 20వ ఈ-గవర్నెన్స్‌ సదస్సు జరుగుతోంది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సును కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి వెంకయ్యనాయుడు, శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

కాగిత రహిత పాలనతో అమల్లో జాప్యం తగ్గుతుంది : చంద్రబాబు
సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేపర్‌లెస్‌ ఆఫీసు విధానాన్ని ప్రస్తావించారు. కాగిత రహిత పాలనతో ఉన్న లాభాలను వివరించారు. కాగిత ఫైళ్ల ప్రక్రియలో విధాన నిర్ణయాల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని వివరించారు. కొందరు అధికారలు అకారంగా ఫైళ్లను తొక్కిపెడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆన్‌లైన్‌ ఫైల్‌ మానెటరింగ్‌ విధాన్ని తీసుకొచ్చిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చినందన్న విషయాన్ని గుర్తు చేశారు. పేపర్‌లెస్‌ ఆఫీసుతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చంద్రబాబు చెబుతున్నారు.

పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి: వెంకయ్య
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమాజంలోఆర్థిక అసమానతలు తొలగిపోయేందుకు దోహదం చేస్తుందని సదస్సుకు హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో మొబైల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయని, భవిష్యత్‌లో బొటనవేలుతో ట్రాశాక్షన్లు జరిపే స్థాయికి భారత్‌ ఎదుగుతుందన్నారు. ఈ-గవర్నెన్స్‌లో ఆంధప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని సదస్సుకు హాజరైన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి, సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ చెప్పారు. 

Don't Miss