మాటలతోనే సరిపెడుతున్నా కేంద్రం

21:39 - February 9, 2018

ఢిల్లీ : అరుణ్‌జైట్లీ మరోసారి పాతపాటే పాడారు. మూడోసారి హామీలతోనే సరిపెట్టారు. ఐదు రోజులుగా ఏపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలని పోరాడుతున్నా అవేవీ జైట్లీ పట్టించుకోలేదు. బడ్జెట్‌ చర్చలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ విభజన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. కొత్తగా ఎలాంటి నిధులు ప్రకటించలేదు. జైట్లీ ఈసారైన ఏపీకి న్యాయం చేసేలా నిధులు ప్రకటిస్తారని అందరూ ఊహించారు. కానీ వారందరి ఆశలపై నీళ్లు చల్లుతూ కొత్తగా నిధుల కేటాయింపులేమీ ప్రకటించలేదు. విభజన హామీల అమలుకోసం సంబంధిత మంత్రిత్వశాఖలు కృషి చేస్తున్నాయి చెప్పారు. రైల్వేజోన్‌, ఉక్కు పరిశ్రమతోపాటు ఇతర డిమాండ్లు కేంద్రం పరిశీలనలో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని... వాటికి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు. ఏపీకి కేంద్రం ఐదేళ్లపాటు సాయం చేస్తుందని పాత హామీనే మరోసారి ఇచ్చారు. జైట్లీ ప్రసంగంలో ఎలాంటి హామీలు లేకపోవడంతో ఏపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా పోరాడుతున్నా కేంద్రానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Don't Miss